డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ డూపర్ హిట్ మూవీ `ఇస్మార్ట్ శంకర్` తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు తో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తోంది.
ఇటీవల ఈ అమ్మడు `కలగ తలైవాన్` అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నిధి తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది.
నిధి మాట్లాడుతూ.. `కోలీవుడ్ స్టార్ ధనుష్ తో ఒక్కసారైనా నటించాలి. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కోరిక. ధనుష్ తో నటించే అవకాశం వస్తే చాలు.. రెమ్యునరేషన్ కూడా వద్దు` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. మరి ధనుష్ తో జోడి కట్టే అవకాశాన్ని నిధి అందుకుంటుందా..? లేదా..? అన్నది చూడాలి.