బోడేపై తమ్ముళ్ళు యాంటీ..టీడీపీలోకి సారథి?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో ఈ పోరు ఎక్కువగా ఉంది…సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈ ఆధిపత్య పోరు టీడీపీలో కూడా ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్రప్రసాద్‌కు ముందు నుంచి కాస్త పొసగదు.  సీటు విషయంలో వీరికి పోటీ ఉంది. అయితే ఇక్కడ బోడే ప్రసాద్ పైచేయి సాధిస్తూ వస్తున్నారు. అయితే 2014లో పోటీ చేసి గెలిచిన బోడే..2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయాక టీడీపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మళ్ళీ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళుతున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో పెనమలూరులో టీడీపీ బలం పెరిగింది.

ఇలా బలం పెరిగిందనుకునే సమయంలోనే టీడీపీలో ఊహించని రచ్చ మొదలైంది. టీడీపీలో ఉండే కొందరు బోడేకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దివంగత చలసాని పండు ఫ్యామిలీని, అనుచరులని బోడే పట్టించుకోవడం లేదని, వారికి విలువ ఇవ్వడం లేదని ఒంటెద్దు పోకడలతో ముందుకెళుతున్నారని కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి బోడే వర్గం కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ కోసం పనిచేసేవారే ఇలా చేస్తున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బోడే..ఎమ్మెల్యే పార్థసారథిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడిన సారథి..టీడీపీలోకి వస్తామని లీకులు ఇస్తున్నారని, అంటే టీడీపీలో ఉండే ఓ వర్గం ఓట్లు పోకూడదని ఇలా చేస్తున్నారని, ఒకవేళ చంద్రబాబు, సారథిని టీడీపీలోకి తీసుకుంటే స్వాగతిస్తానని అంటున్నారు. మొత్తానికి పెనమలూరు నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్నాయి.