వారసుల కోసం జేసీ రీ ఎంట్రీ..రెండు సీట్లే టార్గెట్..!

కాంగ్రెస్ పార్టీలో ఉండగా జేసీ దివాకర్ రెడ్డి..అనంతపురం జిల్లాలో కీలకమైన నేత అనే సంగతి తెలిసిందే. వరుసపెట్టి తాడిపత్రి నుంచి గెలిచిన దివాకర్…రాష్ట్ర విభజన తర్వాత తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.

2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది..జేడీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని రంగంలోకి దింపింది. తాడిపత్రి నుంచి ప్రభాకర్ తనయుడు అస్మిత్, అనంతపురం ఎంపీ దివాకర్ తనయుడు పవన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక తొలిసారి తాడిపత్రి బరిలో జేసీ ఫ్యామిలీ ఓడిపోయింది. అయితే ఆ వెంటనే ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి..తమ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకొచ్చారు. ఇదే సమయంలో తాడిపత్రి మున్సిపాలిటీలో వైసీపీకి చెక్ పెట్టి టీడీపీని గెలిపించుకున్నారు.

అలా అలా తాడిపత్రిపై పట్టు సాధించారు. ప్రస్తుతం సర్వేల్లో తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి అనుకూలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రిలో అస్మిత్ పోటీ చేస్తారా? లేక ప్రభాకర్ పోటీ చేస్తారా?అనేది క్లారిటీ లేదు. ఎక్కువ శాతం అస్మిత్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అటు అనంతపురం పార్లమెంట్ లో పవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. అయితే పార్లమెంట్ పరిధిలో టీడీపీకి పూర్తి బలం పెరగలేదు.

దీంతో దివాకర్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది..ఇంతకాలం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న దివాకర్..తమ వారసుల గెలుపు కోసం రంగంలోకి దిగుతున్నారు. తాజాగా దివాకర్ అనుచరులు సమావేశం అయ్యి, మున్ముందు పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే అంశాలపై చర్చించారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి..ఇప్పటినుంచే తమ పట్టు పెంచుకోవాలని జే‌సి ఫ్యామిలీ చూస్తుంది. మరి దివాకర్ ఎంట్రీ తో అనంతపురంలో టీడీపీకి కలిసొస్తుందేమో చూడాలి.