ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరిగిందా..జగన్ తేల్చేస్తారా?

వరుసపెట్టి వర్క్ షాపులు పెడుతూ..ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు జగన్ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారం చేపట్టాలనే దిశగా పనిచేస్తున్న జగన్‌కు ఎమ్మెల్యేల పనితీరు కాస్త ఇబ్బందిగా మారిన విషయం తెలిసిందే. దీంతో జగన్..వర్క్ షాపులు నిర్వహించి పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే పనితీరుని మెరుగుపర్చుకోవాలని లేదంటే..నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలుమార్లు వర్క్ షాపులు నిర్వహించి ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. గడపగడపకు సరిగ్గా వెళ్లని ఎమ్మెల్యేల లిస్ట్ కూడా బయటపెడుతూ వస్తున్నారు. మళ్ళీ వర్క్ షాపులోపు ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పడాలని సూచనలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగుంది..ఎవరి పనితీరు బాగోలేదు అనే లిస్ట్‌ని జగన్ రెడీ చేసుకున్నారు. ఈ మేరకు మరోసారి వర్క్ షాపు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, వారిపై నియమించిన పరిశీలకులతో సీఎం జగన్‌ ఈ నెల 14న సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్‌ ఏంటో ఈ సందర్భంగా జగన్‌ వివరిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా గడపగడపకు కార్యక్రమంలో ఎవరు ముందున్నారు..ఎవరు వెనుక ఉన్నారనే అంశాలని చెప్పనున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన వర్క్‌షా్‌పలో.. 55 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని జగన్‌ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన మరో వర్క్‌షా్‌పలో గడప గడపలో సరిగా పాల్గొనని 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లను చదివి వినిపించారు. వీరి తీరు మారకుంటే టికెట్లపై ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలా వర్క్‌షాప్‌ పెట్టిన ప్రతిసారీ సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తానంటూ ఎమ్మెల్యేలపై జగన్‌ ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు బట్టే కాదు ముఖ్యమంత్రి పనితీరు బట్టి కూడా గెలుపు అవకాశాలు ఉంటాయనే అంశం తెరపైకి వస్తుంది. కానీ జగన్ ఏమో సీఎంగా తాను సక్సెస్ అని భావిస్తున్నారు.