విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నారప్ప`. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావించారు.
కానీ, కరోనా మహమ్మారి కారణంగా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ఓటీటీలోకి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నారప్పగా వెంకటేష్ నటనా విశ్వరూపం చూపించి విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
అభిమానులు కోరిక మేరకు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో నారప్పను థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. ఒక్క రోజు మాత్రమే ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే థియేట్రికల్ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ లో ఒక్క రూపాయి కూడా మేకర్స్ తీసుకోరట. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు. నారప్ప వసూళ్ళను మొత్తం ఛారిటీకి ఇచ్చేయబోతున్నారట. ఈ విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి సైతం నిర్మాతలకు కు మద్దతు లభించిందట. నిజంగా ఇది గొప్ప విషయమనే చెప్పాలి.