అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `హిట్ 2`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

ఈ ఏడాది సూప‌ర్ హిట్ అయిన చిత్రాల్లో `హిట్ 2` ఒక‌టి. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` కి మంచి ఆదరణ లభించ‌డంతో.. దానికి సీక్వెల్ గా `హిట్ 2`ను రూపొందించారు. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంట‌గా న‌టించారు. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు.

థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో విడుద‌లైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి లాభాల బాట ప‌ట్టింది. రెండో వారంలోనూ ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. అడివిశేష్‌ ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్లు సాధించి డబుల్‌ హ్యట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక‌పోతే హిట్ 2 అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.

పోటీగా అవతార్‌ వంటి సినిమా ఉన్నా, థియేటర్లలో బాగానే పర్‌ఫార్మ్‌ చేస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో ఐదు సినిమాలు విడుద‌ల కానున్నాయి. దాంతో ఈ సినిమాకు సంబంధించిన థియేటర్‌లు చాలా వరకు తగ్గనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హిట్ 2ను ఓటీటీలోకి దింపేస్తున్నార‌ట‌. స్ట్రీమింగ్ డేట్ ను కూడా లాక్ చేశార‌ట‌. జనవరి 6న‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.