`సీతారామం` క‌థ ఎలా పుట్టిందో తెలుసా? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన రెండో సినిమా ఇది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తే.. రష్మిక మందన్నా, సుమంత్‌, తరుణ్ భాస్కర్‌ తదితరులు కీలకపాత్రలను పోషించారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రమిది.

ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేసింది. సౌత్ తో పాటు నార్త్‌ ప్రేక్షకులను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు సీతారామం కథ‌ ఎలా పుట్టింది అనే విషయాన్ని దర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి తాజాగా బయటకు పెట్టారు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో హ‌ను మాట్లాడుతూ.. `కోఠిలో నాకు పుస్తకాలు కొనే అలవాటు ఉంది. అలా నేను కొన్న ఓ సెకండ్ హ్యాండిల్‌ బుక్‌లో లెటర్ కనిపించింది. అది ఓ తల్లి తన కొడుకుకి రాసిన లెటర్. అందులో పెద్దగా విషయం ఏమీ లేదు.. జస్ట్ సెలవులకి ఇంటికి రమ్మని ఆమె కొడుకుకి రాసిందంతే. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. ఆ లెటర్‌లో ఒకవేళ ముఖ్యమైన సమాచారం ఉంటే ఏంటి పరిస్థితి? అలా ఆలోచిస్తుండగా.. పుట్టిన కథే సీతారామం. క‌థ రాసిన త‌ర్వాత స్వ‌ప్న‌గారికి చెప్ప‌గా.. ఆమెకి న‌చ్చి దుల్క‌ర్ ను హీరోగా సూచించింది. అలా దుల్క‌ర్‌ను ఎంచుకున్నాం` అంటూ చెప్పుకొచ్చాడు.