మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ రెడీ అయిపోయింది. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిపోయింది. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసు ఓపెన్ చేశారు..కేసీఆర్ జాతీయ అధ్యక్షుడుగా మారిపోయారు. ఇక ఈయన పని ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడం. ఇందులో భాగంగా మొదట పక్కనే ఉన్న ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసుకుంటున్నారు.
ఏపీలో తమకు ఆదరణ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే అక్కడ కీలకమైన అంశాలపై పోరాటం చేస్తే ప్రజల మద్ధతు వస్తుందని భావిస్తున్నారు. అందులో అమరావతి అంశం, విశాఖ స్టీల్ ప్లాన్ అంశం. ఈ రెండిటిపై పోరాటం చేస్తే కొన్ని వర్గాల ప్రజల మద్ధతు పెరుగుతుందని ఆశిస్తున్నారు. అందుకే త్వరలోనే అమరావతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించడానికి కేసీఆర్ రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేకపోలేదు. ఎలాగో ఏపీలో పార్టీని విస్తరించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సభకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఏపీలో పార్టీ బాధ్యతలని తలసాని శ్రీనివాస్ యాదవ్ చూసుకుంటారని తెలుస్తోంది. ఆయనకు ఏపీలో చాలామంది నేతలతో పరిచయాలు ఉన్నాయి. ఏపీపై ఆయనకు అవగాహన ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీని ఓడించడానికి పరోక్షంగా వైసీపీకి సహకారం అందించారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అమరావతిలో భారీ సభ ప్లాన్ చేశారు. అలాగే విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభించడానికి కూడా చూస్తున్నారు. అయితే అమరావతినే వేదికగా ఎంచుకోవడానికి కారణాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులతో వెళుతుంది. అదే నినాదంతో వెళితే బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది లేదు..మూడు రాజధానుల క్రెడిట్ వైసీపీకే వస్తుంది. అందుకే అమరావతికి మద్ధతు ఇస్తే ఇక్కడ కాస్త బెనిఫిట్ అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి ఏపీలో కేసీఆర్ ప్లాన్స్ సక్సెస్ అవుతాయో లేదో.