ఎలమంచిలిలో ట్విస్ట్..సీటు వాళ్ళకే ఇవ్వాలంటున్న ఎమ్మెల్యే.!

వచ్చే ఎన్నికల్లో పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలు స్వతహాగానే సీటుపై ఆశలు వదులుకుంటున్నారు. ఎందుకంటే వారిపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయం అర్ధమైనట్లు కనిపిస్తోంది. అందుకే సీటు విషయంలో ఇప్పుడు కొత్త మెలికలు పెడుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా..అదే తరహాలో సీటు విషయంలో కొత్త మెలిక పెడుతున్నారు. ప్రస్తుతం ఎలమంచిలిలో ఎమ్మెల్యే కన్నబాబురాజుపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది..ఈయనకు మళ్ళీ సీటు ఇస్తే గెలవడం చాలా కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో జగన్ ఈ సీటులో మరొకరికి ఛాన్స్ ఇవ్వడానికి చూస్తున్నారని తెలిసింది. అది కూడా అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అమర్నాథ్..ఎలమంచిలిపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. నెక్స్ట్ ఎన్నికల్లో అనకాపల్లి సీటు వేరొకరికి ఇచ్చి..ఎలమంచిలి సీటు గుడివాడ తీసుకోవాలని చూస్తున్నారని తెలిసింది.

ఎలమంచిలిలో దమ్మున్న మగాళ్లు లేరా?

ఇదే క్రమంలో తాజాగా జగన్ పుట్టిన వేడుకలు సందర్భంగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో దమ్మున్న మగాళ్లే లేరా? బయట నుంచి ఏ నాయకుడు ఇక్కడ ఎన్నికల బరిలో దిగినా ఓడిపోవడం ఖాయమని అన్నారు. స్థానికులనే ఇక్కడ బలపరుద్దామని, స్థానికేతరులకు ఇక్కడ చోటు లేదని చెప్పుకొచ్చారు.

తాను గానీ తన కుమారుడుగానీ తప్పు చేస్తే తమకు టికెట్‌ ఇవ్వకండని, ఇక్కడ నలుగురు ఎంపీపీలు, నలుగురు జడ్పీటీసీలు ఉన్నారని , వారిలో ఎవరో ఒకరికి ఇవ్వాలని, ఈ విషయంలో చాలా స్ర్టాంగ్‌గా ఉండాలని, స్థానికేతరులకు టికెట్‌ ఇచ్చే పరిస్థితి రాదు….రాకూడదని అన్నారు. అంటే మంత్రి గుడివాడ ఎలమంచిలి సీటుపై ఫోకస్ చేసిన నేపథ్యంలోనే కన్నబాబు రాజు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మరి ఎలమంచిలి సీటు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.