వారిద్దరు సొంత బావబామ్మర్దులు..అంతే కాదు మరోవరుసలో మేనమామ-మేనల్లుడులు కూడా. అంటే దగ్గర చుట్టరికం ఉన్నా సరే..రాజకీయ పరంగా శత్రువులు మాదిరిగా తలపడుతున్నారు. రాజకీయ యుద్ధంలో చుట్టరికాన్ని పక్కన పెట్టి ఫైట్ చేస్తున్నారు. అలా ఫైట్ చేస్తున్న బంధువులు ఎవరో..ఈ పాటికే అందరికీ క్లారిటీ వచ్చేసి ఉండాలి. సొంత బావాబామ్మర్దులైన స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఈ ఇద్దరు నేతలు 2009 ఎన్నికల నుంచి ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు.
ఇక 2014 నుంచి కూన టీడీపీ, తమ్మినేని వైసీపీ నుంచి పోటీ చేశారు. విజయం కూనని వరించింది. 2019 ఎన్నికల్లో సీన్ రిపీట్ అయింది. బామ్మర్దిపై తమ్మినేని పైచేయి సాధించారు. ఇప్పుడు బావకు చెక్ పెట్టాలని చెప్పి కూన తెగ ట్రై చేస్తున్నారు. తమ్మినేనికి అధికార బలం ఉన్నా సరే..కష్టపడి ఆమదాలవలసలో బలపడటమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేసే చర్యలు చేస్తున్నారు.
నియోజకవర్గంలో రాజకీయంగా పైచేయి సాధించాలని చెప్పి కూన ట్రై చేస్తున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో నియోజకవర్గంలో తమ్మినేనికి పెద్దగా పాజిటివ్ కనిపించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో తన తనయుడుని బరిలో దింపాలని చూస్తున్నారు. కానీ తమ్మినేని ఫ్యామిలీకి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. ఇదే సమయంలో కూన సైతం తమ్మినేనిపై రాజకీయ విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
ఇటీవల వైసీపీ బీసీ నినాదం ఎత్తుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, మైనారిటీ అన్నీ జగన్ అని చెప్పి భజన చేసే కార్యక్రమం చేశారు. దీనిపై కూన తీవ్రంగా స్పందించారు. దేశంలో వెయ్యి రూపాయల నోటుకు, రాష్ట్రంలో తమ్మినేని సీతారామ్ మాటకు విలువ లేదని, ఏ ఎండకా గొడుగు పట్టే తమ్మినేనిని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఫైర్ అయ్యారు.
జగన్రెడ్డి బీసీలను ఉద్ధరించినట్లు తమ్మినేని మాట్లాడటం సిగ్గుచేటని, సీతారామ్ చెడ్డీలు వేసుకుని తిరిగే రోజుల్లోనే సామాజిక న్యాయానికి నాందీ పలికిన పార్టీ టీడీపీ అంటూ విరుచుకుపడ్డారు. ఇలా బావనే కూన గట్టిగా టార్గెట్ చేశారు.