ఎయిర్‌పోర్ట్ లో సిద్ధార్థ్ కు ఘోర అవమానం.. 20 నిమిషాలు వేధించారంటూ ఆవేద‌న‌!

తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన సిద్ధార్థ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలతో పాటు వివాదాలతోనూ సిద్ధార్థ్ బాగా పాపులర్ అయ్యాడు. ముక్కు సూటిగా వ్యవహరించే సిద్ధార్థ్ కు తాజాగా ఘోర అవమానం జరిగిందట. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అడ్డుకుని అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారట‌.

దాదాపు ఇర‌వై నిమిషాల వేధింపుల‌కు గురి చేశారంటూ సిద్ధార్థ్ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. డిసెంబర్ 27న మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి వస్తున్నప్పుడు మధురై విమానాశ్రయంలోని సీఆర్పీఎఫ్ సిబ్బంది వేధించారని తెలిపారు. తన తల్లిదండ్రుల జేబులు, బ్యాగుల్లో ఉన్న డబ్బును, ఇతర వస్తువులను బయటకు తీయాలంటూ.. సీఆర్‌పీ వారు ఆర్డర్ధ్ వేశార‌ట‌.

అలాగే అర్ధం కాకుండా హిందీలో మాట్లాడుతూ సిద్ధార్థ్ ఫ్యామిలీని దుర్బాషలు ఆడార‌ట‌. ఇంగ్లీష్ లో మాట్లాడాలని సిద్ధార్థ్ కోరినా పట్టించుకోలేదట‌. దాదాపు ఇర‌వై నిమిషాల పాటు త‌న‌ను, తన తల్లిదండ్రులను సీఆర్‌పీ సిబ్బంది అవమానించారని, వేధింపులకు గురిచేశారని ఇన్‌స్టా పోస్ట్ లో సిద్ధార్థ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. విమానాశ్రయంలోని ఉన్నతాధికారులు ఈ విష‌యంపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేశాడు. దీంతో సిద్ధార్థ్ పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.