‘బీసీ’ మంత్రం..ఈ సారి నమ్మేది ఎవరిని?

ఏపీలో అత్యధిక ఓట్లు ఉన్న బీసీ కులాల ఓట్లని మళ్ళీ కొల్లగొట్టడానికి ప్రధాన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీసీలు ఎటువైపు మొగ్గితే వారిదే అధికారం..అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే బీసీ వర్గాలు మొదట నుంచి ఎక్కువగా టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. కానీ  గత ఎన్నికల్లో బీసీ వర్గం వైసీపీ వైపుకు వెళ్లింది..టీడీపీ కాపు రిజర్వేషన్లు వైపు మొగ్గు చూపడం, బీసీలకు అనుకున్న మేర అండగా లేకపోవడం, మరో వైపు జగన్ కాపు రిజర్వేషన్లు తన వల్ల కాదని చెప్పి..బీసీల వైపు మొగ్గుచూపినట్లు కనిపించడం..అలాగే ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించడంతో..మెజారిటీ బీసీలు జగన్‌కు మద్ధతు తెలిపారు.

దీని వల్ల వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది..మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమైనా ఉందా? అంటే ఏమి లేదనే చెప్పొచ్చు. అందరితో పాటే పథకాలు వస్తున్నాయి. వైఎస్సార్ చేయూత మాత్రం బీసీ, ఎస్సీ, మైనారిటీలకు వస్తుంది. ఇక పదవుల్లో కూడా ఎప్పటిలాగానే బీసీలకు చోటు దక్కింది..కొత్తగా ఏమి మార్పు లేదు. అయితే కొత్త మార్పు ఏదైనా ఉందటే అది..ఒక్కో బీసీ కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేసి..బీసీ నేతలకు పదవులు ఇవ్వడం. మోతమ్ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి ఈ కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి లబ్ది జరిగింది..అసలు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడం లాంటివి చేశారా? అంటే ఒక్క రూపాయి ఇచ్చింది లేదు..కానీ పథకాలు ఇస్తున్నాంగా అని చెబుతున్నారు. ఆఖరికి కార్పొరేషన్ల ఛైర్మన్‌లకు సెపరేట్ గా ఆఫీసులు లేవు.

అంటే వైసీపీ పాలనలో కూడా బీసీలకు సెపరేట్ గా వచ్చింది ఏమి లేదు. కానీ బీసీలకు చాలా చేశామని, అది చెప్పాలని తాజాగా జగన్..వైసీపీలోని బీసీ మంత్రులు, నాయకులతో సమావేశమయ్యారు. మళ్ళీ బీసీ ఓట్లని ఆకర్షించేలా సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఇటు టీడీపీ సైతం ఈ సారి బీసీ ఓట్లని పోగొట్టుకోకూడదని చూస్తుంది. అసలు తమది బీసీల పార్టీ అని అచ్చెన్నాయుడు అంటున్నారు. అటు జనసేన అధినేత పవన్ సైతం..తాజాగా బీసీల్లోని తూర్పు కాపులతో  సమావేశమై..జనసేన అండగా ఉంటుందనుకుంటే..తమ పార్టీకి అండగా ఉండాలని? లేదా వేరే పార్టీ అండగా ఉంటుందని అనుకుంటే..ఆ పార్టీకి మద్దతు ఇవ్వవచ్చని, కాకపోతే బీసీలు ఐక్యంగా ఉండాలని అన్నారు. మొత్తానికి బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి..మరి ఈసారి బీసీలు  ఎవరిని నమ్ముతారో చూడాలి.