మళ్ళీ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే..175 సీట్లు గెలవడమే టార్గెట్ అని అంటున్నారు. ఆ దిశగా ముందుకెళుతున్న జగన్..ఈ సారి ఎన్నికల్లో పలు ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. వారికి సీట్లు ఇవ్వకపోతే వైసీపీకి ఇబ్బంది అవుతుంది..అందుకే కొందరికి సీట్లు ఇవ్వకపోయినా, కొందరికి మాత్రం ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి. కాకపోతే వారి స్థానాల్లో కాకుండా వేరే స్థానాలకు మార్చాలని చూస్తున్నారు.
ఈ సీట్ల మార్పిడి కార్యక్రమంపై జగన్ ఇప్పటినుంచే ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కొందరి సీట్లు మార్చడానికి జగన్ రెడీ అవుతున్నారని తెలిసింది. జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. పైగా టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి పెద్ద డ్యామేజ్ జరిగేది..తూర్పు గోదావరిలోనే..అందుకే ఇక్కడే టీడీపీ-జనసేన పొత్తుకు అనుగుణంగా కొన్ని సీట్లు మార్చాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది.
ఇదే క్రమంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని రాజమండ్రి సిటీకి పంపిస్తారని కథనాలు వస్తున్నాయి. రాజమండ్రి సిటీలో ఎంతమంది ఇంచార్జ్లని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు..అక్కడ టీడీపీదే ఆధిక్యం కనిపిస్తోంది. ఈ క్రమంలో రాజా లాంటి ఫాలోయింగ్ ఉన్న నాయకుడుని అక్కడకు పంపించి..రాజానగరంలో కమ్మ నేతకు సీటు ఇప్పించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. గతంలో తనతో పాటు కాంగ్రెస్లో పనిచేసిన కమ్మ నేత చిట్టూరి రవీంద్రని..రాజానగరం బరిలో పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.
ఎలాగో రాజానగరంలో కాపులతో పాటు కమ్మ వర్గం ప్రభావం ఎక్కువే. ఇక్కడ టీడీపీ నుంచి కమ్మ నేత పెందుర్తి వెంకటేష్ ఉన్నారు..కాబట్టి వైసీపీ నుంచి కూడా కమ్మ నేతనే పెడితే ఎలా ఉంటుందో చూస్తున్నారు. అయితే రాజానగరంలో రాజా స్ట్రాంగ్ గా ఉన్నారు..అలాంటప్పుడు ఆయన్ని మార్చే సాహసం చేస్తారనేది డౌటే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.