చిరంజీవి కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే.. 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అందుకొని సినీ అవార్డు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కూడా ఈ నటుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డుకి అసలైన అర్హుడు చిరంజీవి అని చెప్పడానికి అతని కెరీర్‌లో కొన్ని సినిమాలు చాలు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి 1978లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయన నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. అప్పటికే పునాదిరాళ్లు సినిమా మొదలైంది కానీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు సినిమా. మనం టాలీవుడ్ ప్రజలకు చిరంజీవిని పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ప్రాణం ఖరీదు సినిమా తరువాత చిరంజీవి దాదాపు 20 సినిమాల్లో నటించారు అయినా కూడా ఆయనకి సోలో హీరోగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో 1982లో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా మంచి గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా తీసుకొచ్చింది.

1982లో శుభలేఖ చిత్రంలో చిరంజీవి తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అభిలాష సినిమాలో నటించి కెరీర్‌లో ఇంకో మెట్టు ఎక్కాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఖైదీ. ఈ చిత్రాన్ని 1983లో కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసి చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. తరువాత కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే విజేత సినిమాతో ఇంకో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కోదండరామిరెడ్డితో కలిసి చేసిన ఇంకో సినిమా దొంగ మొగుడు. ఈ సినిమాలో చిరు మాస్ యాంగిల్‌లో నటించి మాస్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమాలో కామెడీ టైమింగ్ కూడా బాగుండటంతో దొంగ మొగుడు సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకుంది. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఇంకో చిత్రంపసివాడి ప్రాణం. ఏ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది.

దర్శకుడు కే.విశ్వనాథ్ తెరకెక్కించిన స్వయంకృషి సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయినా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు చిరు. మెగాస్టార్ ఈ చిత్రంతో నంది పురస్కారాన్ని దక్కించుకున్నాడు. బాలచంద్రన్ తెరకెక్కించిన రుద్రవీణ చిత్రం గ్రామ స్వరాజ్యం నేపథ్యంలో తెరకెక్కింది. నాగబాబు నిర్మించిన ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన యముడికి మొగుడు సినిమా సంచలన విజయం సాధించింది. ఆపై ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా ఇండస్ట్రీలో మరో హిట్ మూవీ అయింది. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే పెద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో చిరంజీవి మార్కెట్‌ను పెంచేసింది.