ఆత్మకూరుపై ఫోకస్..మేకపాటి ఫ్యామిలీకి చెక్..!

నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు కూడా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద బలం కూడా లేదు. మొదట నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. కేవలం 1983, 1994 ఎన్నికల్లోనే ఇక్కడ టీడీపీ గెలిచింది..ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచారు..అలాగే మంత్రిగా పనిచేశారు. కానీ మధ్య గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక వచ్చింది.

ఆ ఉపఎన్నికలో గౌతమ్ సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు 80 వేలు ఓట్లు పైనే మెజారిటీతో గెలిచారు. అయితే ఇప్పటికీ అక్కడ వైసీపీ చాలా బలంగా ఉంది. కానీ వైసీపీ బలం తగ్గించాలని చెప్పి టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి కుమార్తె కైవల్య రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నారు. ఈమె ఉపఎన్నికలోనే పోటీ చేయడానికి చూశారు గాని..సాంప్రదాయం  పాటిస్తూ టీడీపీ పోటీకి దిగలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు సీటు కైవల్యకే ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

కైవల్యకు సీటు ఇస్తే గట్టి పోటీ ఇస్తారని టీడీపీ అధిష్టానం భావిస్తుంది..అయితే ఆత్మకూరులో ఇంకా టీడీపీ బలం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డికి కుడి భుజం మాదిరిగా పనిచేసిన  పుట్టా బ్రహ్మానందరెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మేకపాటి ఫ్యామిలీకి పుట్టా దగ్గర బంధువు.

అయితే గౌతమ్ చనిపోయాక..పుట్టాకు, మేకపాటి ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది. పుట్టాకు ప్రాధాన్యత కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పుట్టా…చంద్రబాబు, లోకేష్‌లని కలిశారు. త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమైంది. ఇంకా ఆత్మకూరులో వైసీపీ నుంచి వలసలు ఉదృతం చేయాలని టీడీపీ చూస్తుంది. మరి ఇక్కడ టీడీపీ బలపడి వైసీపీకి చెక్ పెట్టగలదో లేదో చూడలి.