ఎటు తేల్చుకోలేక‌పోతున్న అఖిల్‌..ఇంత అయోమ‌యం ఎందుకో?

అక్కినేని మూడో త‌రంగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్.. ఆరంభంలో వరుస ఫ్లాపుల‌ను మూటగ‌ట్టుకున్నాడు. అయితే ఫైన‌ల్‌గా గ‌త ఏడాది విడుద‌లైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే సినిమాను ప్రారంభించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీల‌క‌ పాత్రలో కనిపించబోతున్నారు.

స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. కానీ విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఈ సినిమా రిలీజ్ విషయంలో అఖిల్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా విడుద‌ల తేదీని ప‌లుమార్లు వాయిదా వేశారు. ఇక ఎట్ట‌కేల‌కు వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

కానీ సంక్రాంతికి గ‌ట్టి పోటీ ఉండడంతో మేకర్స్ మళ్ళీ అయోమయంలో పడ్డారు. అసలే భారీ బడ్జెట్ తో రూపొందించిన‌ ఈ చిత్రాన్ని రాంగ్ టైం లో దింపితే.. కలెక్షన్ష్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి కాకుండా మరో కొత్త డేట్ ను లాక్ చేయాలని భావిస్తున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. మ‌రి అఖిల్ `ఏజెంట్‌`కు మోక్షం ఎప్పుడు ల‌భిస్తుందో చూడాలి.