సుడిగాలి సుధీర్ గురించి తెలుగు కుర్రకారుకి పరిచయం చేయవలసిన అవసరం లేదు. ప్రముఖ బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకులకు దగ్గరైన సుధీర్ ఇపుడు వెండితెరపైన అలరిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలలో హీరోగా చేసిన ఆయన.. ఇప్పుడు ‘గాలోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే నూతన దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో విలేకర్లతో సినిమా విశేషాలు పంచుకున్నారు సుడిగాలి సుధీర్.
సుధీర్ మాట్లాడుతూ.. “సినిమా లెక్కలు అనేవి నాకు బొత్తిగా తెలియదు. కానీ నా చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు, కొన్న డిస్టిబ్యూటర్లు నష్టపోకూడదని మాత్రం మనసారా కోరుకుంటా. గాలోడు సినిమా కొత్త తరహా చిత్రమని నేను చెప్పను కానీ.. ఇందులో మంచి మాస్ ఎలిమెంట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి. మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకే ఈ సినిమా చేశా. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు కొన్ని సమస్యల్లో చిక్కుకొని సిటీకి వస్తాడు. అయితే ఇక్కడ కూడా అనూహ్యంగా ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో ఓ ప్రేమకథ ఉంటుంది. మరి ఆ సమస్యలేంటి? అన్నది మాత్రం తెరపై చూసి తెలుసుకోవాలి”. అని చెప్పుకొచ్చాడు.
సుధీర్ ఇంకా మాట్లాడుతూ… “కరోనా వంటి విపత్తులను చూసిన తరువాత ఎప్పుడేం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేకున్నాం. ఉన్నన్ని రోజులు నవ్వుతూ.. నవ్విస్తూనే వుంటా. అది వెండితెరైనా.. బుల్లితెరైనా పర్లేదు. హీరోగా ఓ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోవాలని నాకు లేదు. ఓ వైపు సినిమాలూ చేస్తా.. షోలూ చేస్తా. జబర్దస్త్ షో నుంచి బయటకు రావడమన్నది అనేది నేనుగా తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో ఎవరి ప్రమేయము లేదు.” అని చెప్పుకొచ్చాడు.