ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాప్తాడులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతుంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేశారని ప్రకాష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అయితే శ్రీరామ్ ధర్మవరం పైనే ఫోకస్ పెట్టారు. దీంతో సునీతమ్మ రాప్తాడుపై ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు…రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారు..ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు అంశాలపై సునీతమ్మ వర్సెస్ ప్రకాష్ అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే క్రమంలో తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీపై రచ్చ మొదలైంది. గత టీడీపీ హయాంలో జాకీ సంస్థ..రాప్తాడులో నెలకొల్పడానికి సిద్ధమైంది..భూముల సేకరణ కూడా జరిగినట్లు చెబుతున్నారు.
అయితే వైసీపీ వచ్చాక ఎమ్మెల్యే ప్రకాష్ బెదిరించడంతో..ఆ పరిశ్రమ తెలంగాణకు వెళ్లిపోయిందని సునీతమ్మ ఫైర్ అవుతున్నారు. అయితే తమిళనాడులోని కొయంబత్తూరులో ఏర్పాటు చేయాల్సిన ఈ పరిశ్రమను చంద్రబాబు, నాటి మంత్రి పరిటాల సునీత, టీడీపీ జిల్లా నాయకుల అభ్యర్థన మేరకు రాప్తాడు వద్ద మ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రూ.200 కోట్ల పెట్టుబడితో 28 ఎకరాల్లో పరిశ్రమను స్థాపించేలా ఒప్పందం కుదిరింది. 2018లో 28 ఎకరాల స్థలం చుట్టూ రూ.కోటి ఖర్చుతో ప్రహరీ నిర్మించారు. పరిశ్రమ ఏర్పాటుకు సామగ్రి, కార్మికులను సిద్ధం చేశారు. కానీ 2019లో అధికారం మారింది. అయితే వైసీపీ వచ్చాక అధికార పార్టీ నేతలు రాప్తాడు వద్ద జాకీ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే తమకు రూ.15 కోట్లు కమీషన ఇవ్వాలని డిమాండ్ చేశారని టీడీపీ ఆరోపణలు చేసింది. దీనికి ఒప్పుకొని కంపెనీ ప్రతినిధులు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేశారని, అయినా ఫలితం లేకపోవడంతో తెలంగాణకు షిఫ్ట్ అయిపోయారని ఆరోపిస్తున్నారు.
ఇక టీడీపీ నేతలు చెప్పేవి అబద్దాలు అని, అవన్నీ చీకటి ఒప్పందాలు అని, రాని పరిశ్రమలని, వచ్చినట్లు క్రియేట్ చేశారని, భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని ఎమ్మెల్యే ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ అంశమనే కాదు ప్రతి దానిలోనూ సునీతమ్మ, ప్రకాష్‌ల మధ్య రాజకీయం హోరాహోరీగా సాగుతుంది.