ఆర్సీ15: రూ. 10 కోట్ల‌తో పాట‌.. ఇది కాస్త ఓవ‌ర్ గా లేదు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ‌ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 15వ‌ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ‌ బ‌డా నిర్మాత దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో శ్రీకాంత్, అంజలి, జయరాం, సునీల్, నవీన్ చంద్ర, ఎస్ జె సూర్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది. ఇకపోతే గ‌త‌ ఏడాది సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం దాదాపు యాబై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇటీవ‌ల‌ షూటింగ్ కు కొంత బ్రేక్ పడినా.. మళ్లీ రీస్టార్ట్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూజిలాండ్‌లో ఓ ప్రత్యేక సాంగ్ ను చిత్రీక‌రించేందుకు సిద్ధమవుతున్నారు.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ సాంగ్ ను కొరియోగ్రఫీ చేయబోతున్నారట. ఈనెల 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సాంగ్ కు సంబంధించిన షెడ్యూల్ కొన‌సాగ‌బోతోంది. అంతేకాదు ఈ సాంగ్ కోసం దాదాపు రూ. 10 కోట్ల బడ్జెట్ పెడుతున్నార‌ట‌. ఇది రామ్ చరణ్-కియారాల మధ్య సాగే డ్యూయెట్ సాంగ్ అని.. ఇది సినిమాలో ఒక‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఒక పాటకే రూ. 10 కోట్లు పెట్టడం కాస్త ఓవర్‌గా లేదు అంటూ నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు.

 

Share post:

Latest