చాలా రోజుల తర్వాత గుడివాడలో టీడీపీకి కాస్త ఊపు కనిపిస్తోంది.. వరుసగా గెలిచి సత్తా చాటుతున్న కొడాలి నానికి చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యం కాదనే విధంగా గుడివాడలో రాజకీయం నడుస్తూ వచ్చింది. పైగా అధికారంలో ఉండటం, మంత్రిగా ఉండటం వల్ల గుడివాడలో కొడాలిని ఆపడం కష్టమనే పరిస్తితి. కానీ గత కొన్ని రోజుల నుంచి గుడివాడలో టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు.
మొదట ఇక్కడ సీటు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. రావికి కొందరు ఎసరు పెట్టే పరిస్తితి. కానీ తర్వాత నుంచి చంద్రబాబు దగ్గర నుంచి రావికి హామీ దక్కిందని తెలిసింది. దీంతో తానే గుడివాడలో పోటీ చేసేది అని, కొడాలిని ఓడిస్తానని చెప్పి రావి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా రోజుకో గ్రామంలో పర్యటిస్తూ, ప్రజలకు దగ్గర అవుతున్నారు. అలాగే నియోజకవర్గంలో రావిపై ప్రజల్లో సానుభూతి కూడా వస్తుంది.
అటు అధికారంలో ఉండి కూడా నాని ఏం చేయట్లేదనే భావన ప్రజల్లో ఉంది. పైగా కొన్ని గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి జంప్ చేస్తున్నారు. కొడాలికి బాగా పట్టు ఉండే గుడివాడ రూరల్ మండలంలో వైసీపీ కార్యకర్తలని రావి, టీడీపీలోకి లాగుతున్నారు. నిదానంగా గుడివాడలో రావి తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. ఇక ఇదే ఊపుని కొనసాగిస్తే గుడివాడలో కొడాలికి రావి గట్టి పోటీ ఇవ్వొచ్చు.
పైగా జనసేనతో కూడా పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ జనసేన ఓటర్లు 20 వేల వరకు ఉంటారు. వారు మొన్నటివరకు నానికే సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. కానీ నాని, పదే పదే పవన్ని తిట్టడంపై జనసేన శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయితే మాత్రం గుడివాడలో కొడాలికి రిస్క్ పెరుగుతుంది.