తెలుగులో దర్శకురాలు అనగానే తొలుత అందరికీ విజయ నిర్మల గుర్తుకు వస్తారు. 1971లో దర్శకురాలిగా మారిన ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీశారు. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా ఆమె పేరు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ఇక ప్రస్తుతం నందినీ రెడ్డి చక్కటి సినిమాలు తీస్తూ అలరిస్తున్నారు. ఆమె తీసే ఫీల్ గుడ్ మూవీలకు కుటుంబ పరంగా అంతా చూడడానికి అనువుగా ఉంటాయి. ప్రస్తుతం నందినీ రెడ్డి తప్పితే మరో దర్శకురాలు లేరని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో ఓ మహిళ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దర్శకురాలిగా ఓ వెబ్ సిరీస్ సైతం తెరకెక్కించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్ త్వరలో రానుంది. దీనికి దర్శకురాలిగా దీప్తి గంటా వ్యవహరించారు. ఆమె ఎవరో కాదండోయ్.. స్వయానా నేచురల్ స్టార్ నాని సోదరి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సినీ హీరోగా నాని రాణిస్తున్నా ఆయనలో దర్శకత్వ ప్రతిభకు ఏమీ కొదువ లేదు. ఈ తరుణంలో ప్రస్తుతం అతడి సోదరి దర్శకురాలిగా తెలుగు వారికి పరిచయం కానుంది. సోదరిని పరిచయం చేసి వదిలేయకుండా వెబ్ సిరీస్‌కు నాని అన్నీ తానై వ్యవహరించాడు. వెబ్ సిరీస్‌ను తన వాల్ పోస్టర్ బ్యానర్‌పై నిర్మించాడు. అంతేకాకుండా తన సోదరిని పొగడ్తల్లో ముంచేశారు. ఆమెను దర్శకురాలిగా మరింత ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది.
పనిలో పనిగా మీట్ క్యూట్ వెబ్ సిరీస్‌కి రివ్యూ ఇచ్చేశాడు. చాలా అద్భుతంగా తెరకెక్కించారని తన సోదరి, దర్శకురాలు దీప్తిని ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం తెలుగులో మహిళా దర్శకుల కొరత ఉంది. నందినీ రెడ్డి ఒక్కరే స్టార్ హీరోలతో సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకురాలు. మరి ఆ స్థాయిలో దీప్తి రాణిస్తారో లేదో చూడాలి. ఇక ఆమె దర్శకత్వ ప్రతిభ గురించి తెలియాలంటే నవంబర్ 25 వరకు ఆగాలి. ఆ రోజు మీట్ క్యూట్ వెబ్ సిరీస్ విడుదల కానుంది.