టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఏ ముహూర్తాన ఈ మూవీని ప్రారంభించారో కానీ.. ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. షూటింగ్‌కు వరుస బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అసలే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. ఇక ఫస్ట్ ఫెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుని.. దసరా అనంతరం సెకెండ్‌ను ప్రారంభించే లోపే మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు.
దాంతో కొన్ని రోజులు షూటింగ్‌ను నిలిపివేశారు. ఆ వెంటనే మహేష్ బాబు విదేశాలకు ట్రిప్ వెళ్లడంతో ఈ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడడం జరిగింది. పోనీ విదేశాల నుంచి మహేష్ తిరిగి వచ్చాక అయినా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందా అంటే ఇప్పుడు ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పలు అనారోగ్య సమస్యలతో అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ విషాదంలోకి నెట్టేశారు. ఇక తండ్రి మరణంతో తీవ్ర శోకంలో మునిగిపోయిన మహేష్.. మరి కొద్ది రోజుల వరకు షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలోనే మహేష్-త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఇప్పట్లో లేనట్టే అని అంటున్నారు.