సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం.!

తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏ‌ఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఎస్వీ రంగారావులు పిల్లర్లు మాదిరిగా ఉండేవారు. అలాంటి వారు వరుసగా పరమపదించారు. చివరికి కృష్ణ, కృష్ణంరాజులు ఉన్నారు..కానీ ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే కృష్ణంరాజు మరణించగా, నేడు కృష్ణ మరణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించి, లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణ, రాజకీయ జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది.

సినిమాల్లో ఎన్టీఆర్‌కు పోటీగా ఉండే కృష్ణ, రాజకీయాల్లో కూడా పోటీ ఇచ్చారు. కృష్ణ 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాతే సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ఎన్టీఆర్ టీడీపీ ప్రభంజనం కొనసాగుతుండగానే, కృష్ణ కాంగ్రెస్‌లో చేరి సత్తా చాటారు. ఇందిరా గాంధీ మరణించడంతో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో రాజీవ్‌ గాంధీ, కృష్ణని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. వారి మధ్య మంచి స్నేహం కొనసాగింది.

ఇదే క్రమంలో 1989 ఎన్నికల్లో కృష్ణ కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. టీడీపీ అభ్యర్ధి బోళ్ళ బుల్లి రామయ్యపై 71 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో 1991 మధ్యంతర ఎనికల్లో మళ్ళీ పోటీ చేసి 47 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజీవ్ మరణంతో కృష్ణ కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఇస్తూనే వచ్చారు. 2004 టైమ్‌లో వైఎస్సార్‌కు మద్ధతుగా నిలబడ్డారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్‌కు సపోర్ట్ గా ఉన్నారు. కానీ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు.

ఇలా కృష్ణ రాజకీయ జీవితం కొనసాగింది…రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అనేక అవార్డులు అందుకున్నారు.

Share post:

Latest