ఇంజనీర్ కావాలనుకున్న సూపర్ స్టార్ కృష్ణకి ఇంజనీరింగ్ లో సీటు లభించకపోయేసరికి బిఎస్సి లో చేరి ఒకవైపు బీఎస్సీ చదువుకుంటూనే మరొకవైపు సినిమాలలోకి వెళ్లాలన్న తన ఆలోచనను మరింత పదిలం చేసుకుంటూ వచ్చారు. బిఎస్సి పూర్తి చేసిన తర్వాత తన తండ్రితో సినిమాలకు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి కూడా ప్రోత్సహించారు. అలా కొడుకుకు ఇబ్బంది కలక్కుండా సూపర్ స్టార్ కృష్ణ తండ్రి రాఘవయ్య చౌదరి తనతో కలిసి తిరిగిన స్నేహితుడు, వారాహి స్టూడియోస్ అధినేత చక్రపాణి కి కుమారుడి గురించి లేఖ రాశారు. ఆ తర్వాత మిత్రుడు రాజగోపాల వెంకటరత్నం చేత ఆయన అల్లుడు ఆనందబాబు కూడా లేఖ రాయించారు. ఆ ఆనంద్ బాబు ఎవరో కాదు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్వి ప్రసాద్ కుమారుడు.
అలా తండ్రి ఇచ్చిన రెండు లేఖలతో కృష్ణ మద్రాస్ లో అడుగుపెట్టి సినిమా అవకాశాల కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన వయసు 19 సంవత్సరాలు. చక్రపాణి , ఆనంద్ బాబులను కలిసిన తర్వాత కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు చక్రపాణి. ఆయన కూడా వయసుకు తగ్గ పాత్రలు ఏవీ లేవని చెప్పారు. అయితే నటనలో అనుభవం కోసం నాటకాల్లో వేషాలు వేయమని ఎన్టీఆర్ కృష్ణకు సలహా ఇచ్చారట. అలా ఆనందబాబు ద్వారా ఎల్వి ప్రసాద్ ను కలిసిన కృష్ణకి అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అలాగే నాటకాలలో అనుభవం సంపాదించుకుంటే మంచిదని చెప్పారట.
ఇక తెనాలికి చెందిన నాటక రచయిత కొడాలి గోపాలరావు పరిచయంతో కృష్ణ రంగప్రవేశం జరిగింది. “చేసిన పాపం కాశీకి వెళ్లినా!?” అనే నాటకంలో శోభన్ బాబు మొదటి హీరోగా శోభన్ బాబు, రెండవ హీరోగా కృష్ణ అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత చైర్మన్ నాటకంలో హీరోగా చేశారు కృష్ణ. అలా మొదటిసారి తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈయన మొదట ఎంత పారితోషకం తీసుకున్నారు అనే విషయానికి వస్తే.. ఆయన నటించిన తేనె మనసులు సినిమాకు మొదటిసారి రూ.2 వేల పారితోషకం తీసుకున్నారు.