గంటా-ముద్రగడలతో జగన్ ‘కాపు’ రాజకీయం..!

రాష్ట్రంలో కొన్ని వర్గాలు అధికార వైసీపీకి దూరమవుతున్నాయనే చెప్పాలి..గత ఎన్నికల్లో దాదాపు అన్నీ వర్గాలు జగన్‌కు మద్ధతు ఇచ్చాయి. మెజారిటీ సంఖ్యలో మద్ధతు ఉండటంతో భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక..అన్నీ వర్గాలకు న్యాయం చేసేలా జగన్ పాలన సాగుతుందా? అంటే ఆ విషయం ఆయా వర్గాల ప్రజలకే బాగా తెలుసు అని చెప్పొచ్చు.

ఇప్పుడు చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యే పరిస్తితి. ఇందులో మొదటగా కమ్మ వర్గం బాగా దూరమైంది..ఎందుకు దూరమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు బీసీ వర్గాలు సైతం కాస్త అసంతృప్తిగానే ఉన్నాయి. ఇక కాపు వర్గం సైతం వైసీపీకి యాంటీగా మారుతుందనే కథనాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ వల్లే కాపు వర్గం వైసీపీకి దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే అలా దూరమవుతున్న కాపు వర్గాన్ని మళ్ళీ దగ్గర చేసుకునేందుకు జగన్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తూనే ఉన్నారు. ఎలాగైనా కాపు వర్గం ఓట్లు మెజారిటీ సంఖ్యలో తమకే పడాలనే విధంగా రాజకీయం నడుపుతున్నారు.

ఇదే క్రమంలో టీడీపీ-జనసేన గాని కలిస్తే కాపు ఓట్లు మెజారిటీ సంఖ్యలో దూరమవుతాయని జగన్‌కు అర్ధమవుతుంది..అందుకే ఆ ఓట్లు దూరం కాకుండా ఉండటానికి కాపు వర్గంలో కీలకంగా ఉన్న నాయకులని పార్టీలో చేర్చుకునేందుకు చూస్తున్నారని తెలిసింది. అందులో మొదటగా గంటా శ్రీనివాసరావుని వైసీపీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా..వైసీపీలోకి రావాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు..కానీ ఆయన్ని రాకుండా కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎంట్రీకి జగన్ ఓకే చెప్పారు. అటు టీడీపీ అధికారంలో ఉండగా కాపు ఉద్యమం అంటూ హడావిడి చేసి, జగన్‌కు పరోక్షంగా లాభం చేసిన ముద్రగడ పద్మనాభం సైతం వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారట. వీరి ద్వారా కాపు వర్గం మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నారు. మరి వీరి వల్ల కాపు ఓట్లు ఎన్ని మారతాయో చూడలి.