విజయ్ దేవరకొండ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా నిర్మాణంలో విదేశీ పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ లను విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 13 గంటల పాటు విచారణ సాగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత బక్కా జాడ్సన్ ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా లైగర్ ప్రాజెక్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టినట్లు కూడా ఈడీకి ఫిర్యాదు చేసింది తానేనని బక్కా జాడ్సన్ నివేదికలో పేర్కొన్నాడు.
లైగర్ ఇష్యూ ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా కావడంతో నేషనల్ ఇష్యూ అయింది.. ముఖ్యంగా ఈ టాపిక్ ను డైవర్ట్ చేయడానికి తెరాసకు చెందిన కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ కుమ్మక్కై ఒకరి మీద ఒకరు మాటల యుద్ధాలు చేసుకుంటున్నారని ఇదంతా ఒక డ్రామా అని బక్కా జాడ్సన్ ఆరోపించారు. ఇకపోతే 17 మంది సెలబ్రిటీలు ఉన్న ఫోటోలను ఈడి ఆఫీస్ లో ఇచ్చింది కూడా నేనే.. తెల్లారే రంగారెడ్డి జిల్లా కోర్టు వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది . అయితే ఈ కేసులో పూరి జగన్నాథ్ , ఛార్మి కూడా ఉన్నారు. అక్కడి నుంచే వీరికి కవితతో అనుబంధం ఏర్పడింది. అంతేకాదు చాలామంది పెద్దపెద్ద నిర్మాతలకు, దర్శకులకు హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని, అతడిని ప్రమోట్ చేయాలని కూడా కవిత చెప్పింది. ఇవన్నీ కూడా నేను ఈడికి వివరించాను అంటూ తెలిపారు జాడ్సన్.
ఎన్నడూ లేని విధంగా పూరి జగన్నాథ్ కూడా లైగర్ సినిమా అప్పుడు ఎక్కువ మార్కెట్ కి వచ్చాడు. నేను డబ్బులు కట్టను.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా మాట్లాడాడు . ఒక పాన్ ఇండియా సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరు అలా మాట్లాడరు. ఈ కథ స్క్రీన్ ప్లే నడిపింది మొత్తం కవిత, అరవింద్ వాళ్లే అంటూ తెలిపాడు. అంతేకాదు కచ్చితంగా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేయడానికి తీసిన సినిమా ఇది . కాబట్టే ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద డ్రామా నడుస్తోంది . సీఎం కూతురు కవిత , బిజెపి నాయకుడు ఇద్దరు కలిసే ఈ ఇష్యూ ని పక్కదోవ పట్టిస్తున్నారు అంటూ బక్కా జాడ్సన్ ఆరోపిస్తున్నారు . మరి ఈ విషయంపై చిత్రం యూనిట్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.