టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆదివారం అర్ధరాత్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన.. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటు.
350 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఇకలేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు 45 సంవత్సరాలు విరామం లేకుండా సినిమాల్లో నటించిన ఆయన తన పేరిట ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు.
ముఖ్యంగా నాటికి నేటికి ఓ అరుదైన రికార్డు ఆయన పేరిట లెక్కించి ఉంది. భారతీయ సినీ పరిశ్రమలో కాదు కాదు.. ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన ఏకైక హీరోగా కృష్ణ రికార్డులకు ఎక్కారు. బొబ్బిలి దొర, రక్తసంబంధం, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, పగపట్టిన సింహం, డాక్టర్ సినీ యాక్టర్, కుమార రాజా వంటి చిత్రాల్లో కృష్ణ ట్రిపుల్ రోల్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అలాగే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో కూడా కృష్ణే. ఆయన తన కెరీర్ మొత్తంలో దాదాపు 50 మల్టీస్టారర్ సినిమాలను చేశారు.