తెలుగులో హీరో కం రైటర్స్‌ వీరే… సత్తా చూపుతున్న యువహీరోలు!

తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పటిలాగా కాదు, ఇపుడు మంచి దూకుడుమీద వుంది. ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ రూపొందుతున్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ హీరోలు అయితే ఏదో మొక్కబడిగా నటించడమే కాకుండా మిగిలిన క్రాఫ్ట్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. తమ కథలను తామే రాసుకోవడమే కాకుండా.. అవసరం వచ్చినపుడు మెగాఫోన్ కూడా పట్టుకుంటున్నారు. దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే ఆ సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే మొదట సగం సినిమా రైటింగ్ తోనే పూర్తవుతుంది. అందుకే పూరీ జగన్నాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ లాంటి దర్శకులు తమ సినిమాలకు తామే కథలు రాసుకుంటారు.

ఇకపోతే నేడు దర్శకులు మాత్రమే కాకుండా హీరోకు కూడా కథలు తయారుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ కోసం తామే కథలు రాసుకుని హీరోలవుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న కుర్ర హీరోలు మరో రైటర్‌పై ఆధారపడటం లేదు. అవును, అడివి శేష్, విశ్వక్ సేన్, నవీన్ పొలిశెట్టి, సిద్ధు, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా రైటింగ్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు. క్షణం, గూడఛారి లాంటి సినిమాలకు అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించిన సంగతి విదితమే.

అలాగే కృష్ణ అండ్ హిస్ లీల కథ, స్క్రీన్ ప్లే రాసిన సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ మధ్యే విడుదలైన డిజే టిల్లుకు కూడా కథ, మాటలు రాసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక జాతి రత్నాలు కంటే ముందు నవీన్ చేసిన చేసిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాకు అతగాడు కథ, స్క్రీన్ ప్లే అందించిన విషయం తెలుసు కదా. ఇక కిరణ్ అబ్బవరం అనే హీరో SR కళ్యాణమండపం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. 25 సంవత్సరాలకే ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు విశ్వక్ సేన్. నన్ను నేనే లేపుకుంటా అంటూ ఇరగదీస్తున్నాడు ఈ యువహీరో.