రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?

ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి.

ఒక్క వైసీపీ మాత్రం మూడు రాజధానులు అంటుంది..ఆ దిశగానే ముందుకెళుతుంది. అయితే మూడు రాజధానుల బిల్లులో లోపాలు ఉండటంతో..ఆ బిల్లుని ఉపసంహరించుకున్నారు. మళ్ళీ ఇంకో బిల్లుతో ముందుకురావాలని చూస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి రైతులు..అమరావతి టూ అరసవెల్లి(శ్రీకాకుళం) వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం వారి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుంది.

ఇలా అమరావతి రైతుల పాదయాత్ర మొదలవ్వగానే..ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు..విశాఖని పరిపాలన రాజధాని అనే డిమాండ్‌తో పోరాటం మొదలుపెట్టారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ..మూడు రాజధానులకు మద్ధతుగా గళం విప్పుతున్నారు. అయితే అమరావతి రైతులు వారి దారిలో వారు అరసవెల్లికి వెళుతున్నారు.

ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు మద్ధతు ఇస్తే ఇస్తారు..లేదంటే లేదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం..అమరావతి పాదయాత్రని అడ్డుకుంటామని, వారిని తరిమికొడతామన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర మంత్రులంతా అదే బాటలో ఉన్నారు. ఎవరికి వారే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు కూడా అమరావతి రైతులపై విరుచుకుపడుతున్నారు. విశాఖని రాజధానిగా అడ్డుకునేవారిని రాజకీయంగా చితక్కొడతామని అంటున్నారు.

అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేసి విశాఖ కోసం ఉద్యమం చేస్తానని అంటున్నారు.  తాను రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తే లక్షలాది మంది తన వెనుక వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఎవరి ప్రాంతం కోసం వారు పోరాటం చేయడంలో తప్పు లేదు..కానీ వేరే ప్రాంతం వాళ్ళు పాదయాత్ర చేసుకుంటుంటే అడ్డుకుంటామనేది కరెక్ట్ కాదనే భావన రాష్ట్ర ప్రజల్లో వస్తుంది. అమరావతి రైతుల పాదయాత్ర చేయనిస్తే..వారికి ఉత్తరాంధ్ర ప్రజలు మద్ధతు ఇవ్వకపోతే, అక్కడే అర్ధమైపోతుంది. అలా కాకుండా అడ్డుకుంటాని రెచ్చగొట్టే తరహా ప్రసంగాలు వల్ల అమరావతి రైతులపైనే సానుభూతి పెరుగుతుంది. మరి చూడాలి రాజీనామా చేసి ఉద్యమం అంటున్న ధర్మాన..ఆ దిశగానే ముందుకెళ్తారో లేదో.