పూరి జగన్నాధ్ పరిస్థితి అంత దారుణంగా వుందా? ఈసారి కొడుకే దిక్కా?

సినిమా పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అంతవరకూ హై ఇమేజ్ మెంటైన్ చేసేవారు సడెన్ గా అదః పాతాళానికి పోతుంటారు. ఇక్కడ సక్సెస్ మేటర్స్. అవును.. ఇది మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విషయంలో స్పష్టమైంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగిన పూరీ జగన్నాథ్ పరిస్థితి నేడు రివర్స్ అయింది. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సాధించిన ఘనత ఆయనది. అప్పట్లో హీరోలంతా పూరీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేసినా చాలు అనుకొనేవారు.

టెంపర్ సినిమా తర్వాత చాలా ఏళ్ళు సక్సెస్ లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అలాంటి టైమ్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఆయన కెరీర్ కు కాస్ట్ ఊరటనిచ్చింది. దీంతో పూరీ కెరీర్ మళ్ళీ గాడిలో పడినట్టే కనిపించింది. విజయ్ దేవరకొండ లాంటి యూత్‌ఫుల్ ఇమేజ్ కలిగిన హీరో దొరకడం.. కరణ్ జోహార్ లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఆయనతో చేతులు కలపడంతో ‘లైగర్’ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాకోసం ఎంతగానో ఈగర్‌గా వెయిట్ చేసిన సినిమా ప్రేక్షకులు పూర్తిగా నిరాశకు గురి అయ్యారు. ఆయన నుంచి అంత తక్కువ స్థాయి సినిమాను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆడియన్స్.

ఇకపోతే లైగర్ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో పూరీకి భారీ నష్టాలు తప్పడం లేదు. ఇకపై ఆయన్ను నమ్మి స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూరీ తన కొడుకు ఆకాశ్‌ను హీరోగా పెట్టి ఓ కొరియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ‘మెహబూబా’తో హీరోగా మారిన ఆకాశ్.. ఆ తర్వాత ‘రొమాంటిక్, చోర్ బజార్’ చిత్రాలతోనూ చేదు అనుభవాల్ని చవిచూశాడు. ఈసారి తండ్రీకొడుకులు కలిసి ఎలాంటి మేజిక్ చేస్తారో చూడాలి మరి.