ఆ శ్రీదేవికి కూడా సీటు కష్టమేనా!

ప్రజా మద్ధతు తగ్గిన ఎమ్మెల్యేలకు మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూడేళ్లలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుని, ప్రజా బలం పోగొట్టుకుంటూ వచ్చారు. అలాంటి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్ధతు పెంచుకోవాలని జగన్ సూచించారు..కానీ కొందరు ఎమ్మెల్యేలు ప్రజా మద్ధతు పెంచుకోవడంలో విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నారు. అలాంటి వారికి నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమని తాజాగా తాడికొండ స్థానంలో అదనపు సమన్వయకర్తని నియమించి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.

తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందనే సంగతి తెలిసిందే..పైగా ఆమె అనుచరుల అక్రమాలు ఎక్కువని ఆరోపణలు ఉన్నాయి..ఈ క్రమంలో ఆమెకు మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి..ఈ క్రమంలో జగన్…తాడికొండలో అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని నియమించి శ్రీదేవికి సీటు లేదని పరోక్షంగా హింట్ ఇచ్చారు.

ఇక శ్రీదేవి బాటలో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి నెక్స్ట్ సీటు డౌటే అని ప్రచారం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్న పత్తికొండలో గెలిచిన శ్రీదేవిపై కూడా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. తన భర్త కే‌ఎల్ నారాయణరెడ్డి మరణంతో శ్రీదేవి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కే‌ఈ కృష్ణమూర్తి గెలిచిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి కోట్ల హరి చక్రపాణి రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ నుంచి కే‌ఎల్ నారాయణ రెడ్డి పోటీ చేసి 31 వేల ఓట్లు వరకు తెచ్చుకున్నారు. అయితే అనూహ్యంగా నారాయణరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ క్రమంలో వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి ..పత్తికొండలో నిత్యం తిరుగుతూ…2019 ఎన్నికల్లో సీటు దక్కించుకుని, భర్త సెంటిమెంట్, వైసీపీ గాలితో భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.

అయితే ఎమ్మెల్యేగా మూడేళ్లలో శ్రీదేవి పత్తికొండకు చేసింది ఏమి కనబడటం లేదు. పైగా శ్రీదేవి బంధువులు, అనుచరులు హడావిడి ఎక్కువ…అక్రమాలు ఎక్కువ అని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టుల్లో వాటాలు, ఇసుకలో అక్రమాలు..అలాగే గతంలో రైల్వే పనుల్లో ఓ కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలేదని.. సూపర్ వైజర్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అన్నిరకాలుగా శ్రీదేవికి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. నెక్స్ట్ గాని ఈమెకు సీటు ఇస్తే గెలుపు డౌటే అని కర్నూలు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు కే‌ఈ కుటుంబం బలపడుతున్న వేళ శ్రీదేవికి జగన్ మళ్ళీ సీటు ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది.