సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!

ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది.

అయితే ఇటీవల వచ్చిన సర్వేలో టీడీపీ-జనసేన కలిస్తే ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పలేదు. తాజాగా దానికి సంబంధించిన సర్వేని ఆత్మసాక్షి బయటపెట్టింది. రెండు పార్టీలు కలిస్తే టీడీపీ 105-110, జనసేనకు 10-12 సీట్లు వస్తాయని చెప్పింది. అంటే రెండు పార్టీలు కలిస్తే 115-122 సీట్ల వరకు గెలుచుకుంటుందని చెప్పింది. అలాగే వైసీపీకి 60-65 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది..ఒకవేళ టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే…వైసీపీదే అధికారం అని చెప్పింది.

అప్పుడు వైసీపీకి 95-102 సీట్లు, ఆ మూడు పార్టీలకు కలిపి  70-75 సీట్లు వస్తాయని చెప్పింది. అంటే బీజేపీతో కలిస్తే చాలా డ్యామేజ్ జరుగుతుందని క్లియర్ గా తెలుస్తోంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాలని అమలు చేయకుండా, రాష్ట్రానికి న్యాయం చేయని బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అర్ధమవుతుంది.

ఇక అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి ఎడ్జ్ ఉంది. అలాగే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసినా సరే వైసీపీకి అధికారం దక్కడం కష్టమని తెలుస్తోంది. అయితే జనసేన విషయంలో ఆత్మసాక్షి చేసిన సర్వేలో..ఆ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 9.34 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అలాగే సింగిల్ గా పార్టీకి అయిదు జిల్లాల్లో 10 శాతంపైనే ఓట్లు వస్తున్నాయి. విశాఖలో 16.5, తూర్పు గోదావరిలో 22, పశ్చిమలో 21, కృష్ణాలో 11.5, గుంటూరులో 9.75 శాతం ఓట్లు వస్తున్నాయి. ఇక జనసేనకు సింగిల్ గా 30 శాతంపైనే ఓట్లు పడే స్థానాలు..రాజమండ్రి రూరల్, పిఠాపురం, రాజోలు, కాకినాడ సిటీ, భీమవరం, నరసాపురం,తాడేపల్లిగూడెం సీట్లు. మొత్తానికి టీడీపీ-జనసేన కలిస్తే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.