మన హీరోలకి బుర్రలేదా? OTTలో రిలీజైన ఇతర భాష సినిమాలు రీమేక్‌ చేస్తారేమిటి… కధలు దొరకలేదా?

ఈమధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఇతర భాష సినిమాలను రీమేక్ చేసే పనిలో మునిగిపోయారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య సినిమా అభిమానులు నవ్వుకుంటున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఓ తమిళ సినిమాని ‘కాటంరాయుడు’ పేరుతో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇపుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫెర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా తెలుగులో డబ్ అయింది. ఈ సినిమాని దాదాపు అందరూ చూసేసారు.

ఈ క్రమంలోనే అనేకమందికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఓ సినిమా హక్కులు కొనేటప్పుడు సో కాల్డ్ నిర్మాతలు, నటీనటులు చేసుకోరా? అన్ని రకాలుగా లెక్కలేసుకొని, కష్టనష్టాలు చూసుకొని చేస్తూ వుంటారు కదా. మరి ఇలాంటి తప్పులు ఎలా జరుగుతున్నాయని అంటున్నారు. ఇపుడు OTT బాగా ప్రబలింది కనుక అందులో కూడా సో కాల్డ్ సినిమాలు రిలీజ్ అయ్యాయేమో చూసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనవాళ్ళు మలయాళంలో విడుదలైన సినిమాలు, ముఖ్యంగా ప్రేమ కథల్ని అస్సలు వదలడం లేదు.

నిర్మాతలు, దర్శకులు ఓ పక్క కథల్ని కొనేయడానికి సిద్ధమవుతుంటే, మన సినిమా ప్రేక్షకులు వాటిని సబ్‌టైటిల్స్‌తో చూసేయడానికి రెడీగా వుంటున్నారు. ఇక తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ఉండనే వుంది. ఇక్కడ అదో పెద్ద బిజినెస్. నేడు మలయాళం సినిమాలకు తెలుగునాట OTTలో మంచి విలువ కనిపిస్తోంది. అందుకే ఓ ప్రముఖ OTT మలయాళ సినిమాల్ని వరుసగా కొనేసి వారానికొకటి స్పెషల్‌ అంటూ విడుదల చేస్తోంది. టోవినో థామస్ నటించిన ‘తళ్ళుమాల’ మలయాళంలో అదరగొట్టేసింది. సుమారు రూ. పది కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన సినిమా ఏకంగా రూ. వంద కోట్ల గ్రాస్ సాధించిందట. ఈ సినిమాను తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రీమేక్‌ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్‌.