వైసీపీ కంచుకోటలో టీడీపీ ఇంచార్జ్ ఫిక్స్..నెగ్గుతారా?

టీడీపీ అధినేత చంద్రబాబు చాలా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..వయసు మీద పడే కొద్ది ఎవరైనా అలిసిపోయి రెస్ట్ తీసుకుంటారు..కానీ బాబు రెస్ట్ లేకుండా పనిచేస్తూ..టీడీపీ నేతలకే అలుపు వచ్చేలా చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే కసితో టీడీపీ నేతలు పనిచేసేలా వారి వెంటపడుతున్నారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేస్తున్నారు.

అలాగే ఇటీవల కాలంలో వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వరుసపెట్టి వన్ టూ వన్ సమావేశం అవుతున్నారు. వారి ద్వారా నియోజకవర్గంలో పరిస్తితులని తెలుసుకుంటున్నారు. అలాగే నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకుని..ఏ ఏ అంశాల్లో నేతలు మెరుగు పడాలో క్లియర్ గా వివరిస్తున్నారు. తాజాగా కూడా కొందరు ఇంచార్జ్‌లతో బాబు సమావేశమయ్యారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, చీపురుపల్లి ఇన్‌చార్జి కిమిడి నాగార్జున, రాయదుర్గం ఇన్‌చార్జి కాల్వ శ్రీనివాసులు, సాలూరు ఇన్‌చార్జి గుమ్మడి సంధ్యారాణి, మచిలీపట్నం ఇన్‌చార్జి కొల్లు రవీంద్రలతో వన్ బై వన్ సమావేశమయ్యారు.

అలాగే ఎర్రగొండపాలెం తాత్కాలిక ఇంచార్జ్‌గా కొనసాగుతున్న ఎరిక్షన్ బాబుతో కూడా భేటీ అయ్యి, ఆయన్ని పర్మినెంట్ ఇంచార్జ్‌గా నియమించారు. అసలు ఎర్రగొండపాలెం అంటే వైసీపీ కంచుకోట..ఇక్కడ ఇప్పటికీ వైసీపీ బలంగా ఉంది. మంత్రి ఆదిమూలపు సురేశ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అక్కడ ఆయనకు చెక్ పెట్టడం ఈజీ కాదు.

అయితే గత ఎన్నికల నుంచి ఎర్రగొండపాలెంలో టీడీపీ పరిస్తితి సరిగ్గా లేదు..ఈ క్రమంలోనే ఆ మధ్య ఎరిక్షన్ బాబుని ఇంచార్జ్‌గా పెట్టారు. అయినా సరే ఇంచార్జ్ పదవి కోసం ఇంకా కొందరు నేతలు ప్రయత్నించారు. అజితారావు, మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు సైతం వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎర్రగొండపాలెం సీటు తీసుకోవాలని చూస్తున్నారు.

కానీ చివరికి బాబు మాత్రం..ఎరిక్షన్ బాబుని పర్మినెంట్ ఇంచార్జ్‌గా ఫిక్స్ చేశారు. అలాగే ఈ సారి ఎర్రగొండపాలెంని ఖచ్చితంగా గెలిపించి తీసుకురావాలని..ఆ నియోజకవర్గపు నేత మన్నే రవీంద్రకు బాబు సూచించారు. మరి చూడాలి ఈ సారైనా వైసీపీ కంచుకోట టీడీపీకి దక్కుతుందేమో.