ఔను.. జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఎవరు పనిచేయకపోతే.. వారికి టికెట్లు ఇవ్వనని చెప్పారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు తర్జన భర్జనపడుతున్నారు. ఇప్పటి వరకు తాము పనిచేసినా.. చేయలేదని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు. కొందరు.. ఏకంగా.. తమపై నమ్మకం లేకపోతే.. ఇప్పుడే తెగేసి చెప్పేయొచ్చుకదా! అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ చేసిన ప్రకటనపై వైసీపీలోనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ఒకటి.. అత్యంత కీలకమైన వారసుల వ్యవహారం. ఎమ్మెల్యేల వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇది పెద్ద సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్.. పేర్ని నాని, తమ్మినేని సీతారాం.. సహా.. అనేక మంది ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకు వారసులను రంగంలోకి దింపాలని అనుకున్నారు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. యువతను ప్రోత్సహించేందుకు.. టీడీపీ రెడీ అవుతున్న నేపథ్యంలో తమ తరఫున కూడా యువతను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.
కానీ, జగన్ మాత్రం కాదంటున్నారు. ఇది సహజంగానే.. నాయకులకు సంకటంగా మారింది. మరోవైపు.. సర్వేలను మరింత పెంచుతామని చెప్పడం. దీనిపైనా.. నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఎన్ని సర్వేలు చేసినా.. ఏం చెబుతారు? అని ప్రశ్నిస్తున్నారు.అసలు సర్వేలు చూసుకునే గతంలో తమకు టికెట్లు ఇచ్చాయా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో అనేక పార్టీల్లో పనిచేసిన వారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వీరికి సర్వేలంటే.. కొత్తకాదు.
కానీ.. జగన్ చెబుతున్న సర్వేలు వేరేగా ఉంటున్నాయి. ఇదే వారికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సర్వే అనేది.. ఎన్నికలకు ముందు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగ పడుతుందని అంటున్నారు. అంతే తప్ప.. వ్యక్తిగతంగా ఏం తేలుతుంది. ఎవరు పనిచేస్తున్నారనేది.. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే జగన్కు ఒక అవగాహన ఉండాలని అంటున్నారు. ఏదేమైనా.. జగన్ చెబుతున్న దానితో నాయకులు ఏకీభవించడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.