ఆ యువనేతపై బాబు ఫోకస్..?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అనేది చాలా ముఖ్యం. ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది తప్పనిసరి…లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాలసిన పని లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ గెలుపుకు యువత ఓట్లు చాలా కీలకం. ఆ యువత ఓట్లని ఆకర్షించాలంటే …బలమైన యువనాయకులు కావాలి.

అందుకే వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే సీట్లు ఇస్తానని చంద్రబాబు ముందే చెప్పేశారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో యువ నేతలకు సీట్లు ఇచ్చేందుకు బాబు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో ఓ యువ నేతపై బాబు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. నిత్యం నియోజకవర్గంలో పనిచేస్తూ..ప్రజలకు అండగా ఉంటున్న ఆ యువ నేత పనితీరుని బాబు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక అదే స్థానంలో ఇంచార్జ్‌గా ఉన్న సీనియర్ నేత పనితీరుని కూడా గమనిస్తున్నారట. ఈ క్రమంలో సీనియర్ కంటే యువ నేత పనితీరు మెరుగ్గా ఉందని సర్వేల్లో తేలిందట. అందుకే ఇంకా కొంత సమయం వేచి చూసి ఆ  యువనేతకు సీటు ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. అయితే ఈ కథ అంతా నడిచేది పాతపట్నం నియోజకవర్గం గురించి. గత రెండు ఎన్నికల్లో వరుసగా పాతపట్నంలో టీడీపీ ఓడిపోయింది.

కానీ ఈ సారి అక్కడ టీడీపీకి అనుకూల వాతావరణం ఉంది..వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం కలిసొచ్చే అంశం. కాకపోతే ఇక్కడ టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు…ఈ ఇద్దరు నేతలు సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నారు. అయితే వెంకటరమణ కంటే గోవిందరావు నియోజకవగ్రంలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఆఖరికి సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉంటున్నారు. అలాగే తక్కువ సమయంలోనే బలమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇప్పుడు నియోజకవర్గంలో కలమట కంటే మామిడి వైపే టీడీపీ శ్రేణులు మొగ్గు చూపుతున్నారు. బాబు కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో సర్వే చేయిస్తున్నారట. మామిడికే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని తెలిసిందట. అందుకే ఇంకొన్ని రోజులు సమయం ఇచ్చి…చివరికి మామిడికే పాతపట్నం సీటు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి పాతపట్నం రాజకీయం ఎలా ఉంటుందో.