పవన్-ఎన్టీఆర్ కలిసే..కమలం పాలిటిక్స్!

ఒకప్పుడు దేశ రాజకీయాలు వేరు…ఇప్పుడు వేరు..ముఖ్యంగా మోదీ-అమిత్ షా ద్వయం చేసే రాజకీయాలు ఊహించని విధంగా నడుస్తున్నాయి…అసలు రాజకీయాల్లో ప్రత్యర్ధులు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అలాగే తమకు ఎవరితో అవసరం ఉంటే..వారిని దగ్గర చేసుకుని..వారిని రాజకీయంగా వాడుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం దిశగా బీజేపీ ముందుకెళుతుంది. అయితే తెలంగాణలో పార్టీ బలపడుతుంది గాని..ఏపీలో మాత్రం గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది.

ఇప్పటికీ ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా బలపడటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇప్పటికే ఏపీలో పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ని బీజేపీకి మద్ధతుగా ప్రచారం చేయించుకునేందుకు షా భేటీ అయ్యారని కథనాలు వచ్చాయి.

ఇటు ఎన్టీఆర్ సన్నిహితుడైన కొడాలి నాని సైతం..అమిత్ షా పెద్ద స్కెచ్‌తో వచ్చారని, ఎన్టీఆర్ క్రేజ్‌ని వాడుకోవడానికి చూస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో ఎలాగో ఉపయోగం లేదు కాబట్టి…ఎన్టీఆర్‌ సాయం తీసుకుని బీజేపీ బలపడాలని చూస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ను ఎక్కడ ఎక్కువగా అభిమానిస్తారు? జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చి మీటింగులు పెడితే జనం ఎక్కువగా ఎక్కడ వస్తారు?… ఆంధ్రలోనా, తెలంగాణలోనా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు రివర్స్‌లో సమాధానం చెప్పారు.

అంటే ఏపీలోనే ఎన్టీఆర్‌కు క్రేజ్ ఉందని, ఆయన్ని ఏపీలో బీజేపీ తరుపున వాడుకుంటామన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు. అటు పవన్ సైతం తమతో పొత్తులోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అంటే పవన్-ఎన్టీఆర్ కలిసి ఏపీలో బీజేపీని పైకి లేపుతారనే విధంగా సోము చెప్పుకొచ్చారు. అసలు ఎన్టీఆర్ ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చేది లేదు…వచ్చినా టీడీపీని కాదని బీజేపీ వైపుకు ఎందుకు వెళ్తారు. అయితే ఇప్పుడు ఏదొకరకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని అయినా తిప్పుకోవాలనే భాగంగా బీజేపీ ఈ పోలిటికల్ గేమ్ ప్లే చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Share post:

Latest