టీడీపీ సిట్టింగుల్లో పట్టు దొరకడం లేదే!

వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. అయితే పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల వైసీపీ అదిరిపోయే విజయాలని సాధించింది గాని…అసెంబ్లీ స్థానాల్లో మాత్రం పట్టు సాధించలేకపోయింది. ఏదో అధికార బలంతో లోకల్ ఎన్నికల్లో సత్తా చాటింది గాని..అసెంబ్లీ స్థానం విషయానికొస్తే చతికలపడేలా ఉంది. అయితే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళగా టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మిగిలారు.

ఈ 19 స్థానాల్లో వైసీపీ బలం అనుకున్నంతగా పెరగలేదని తెలుస్తోంది. ఏదో రెండు, మూడు స్థానాల్లో తప్ప మిగతా స్థానాల్లో టీడీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. మొదట కుప్పం గురించి చెబితే…అక్కడ పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది…కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. అలా అని అసెంబ్లీలో గెలుస్తుందా? అనే చెప్పలేం. అక్కడ ప్రజలు చంద్రబాబు వైపే మొగ్గు చూపుతున్నారు.

బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా అదే పరిస్తితి. ఇక పర్చూరు, అద్దంకి, విజయవాడ ఈస్ట్, పాలకొల్లు, ఉండి, మండపేట, పెద్దాపురం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, విశాఖ ఈస్ట్, వెస్ట్, టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో టీడీపీ బలంగానే కనిపిస్తోంది. ఈ స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని సర్వేల్లో తెలుస్తోంది. అయితే ఉరవకొండ, కొండపి, రేపల్లె స్థానాల్లో టీడీపీకి వైసీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.

అలాగే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్‌లో వైసీపీ బలం పెరిగింది. ఇక టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలని పరిశీలిస్తే…చీరాల, గన్నవరంలో వైసీపీ బలంగా ఉంది. గుంటూరు వెస్ట్‌లో టీడీపీ పట్టు ఇంకా తగ్గలేదు. విశాఖ సౌత్‌లో టీడీపీ-వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంది. మొత్తానికి చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నా సరే టీడీపీ సిట్టింగ్ సీట్లుపై పెద్దగా పట్టు సాధించలేదు.