వారసురాలు కోసం యనమల తిప్పలు?

తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా రాజకీయం చేస్తున్న యనమల రామకృష్ణుడు…ఫ్యామిలీకి రాజకీయంగా ఏ మాత్రం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. 1983 నుంచి 2004 వరకు వరుసపెట్టి గెలుస్తూ సత్తా చాటుతూ వచ్చిన యనమలకు…2009లో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. 2009లో ఆయన విజయానికి బ్రేక్ పడింది..కంచుకోట లాంటి తుని నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోయారు.

ఇక అప్పుడు మొదలు ఇప్పటివరకు తునిలో యనమల ఫ్యామిలీ గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో యనమల తమ్ముడు కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా విజయాలు అందుకున్నారు. పైగా ఇప్పుడు ఆయన మంత్రి కూడా. దీంతో ఇంకా తునిలో ఆయన బలం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అదే సమయంలో యనమల సోదరుడు వల్ల…టీడీపీ బలం ఇంకా తగ్గుతుంది. అసలు కృష్ణుడు నాయకత్వాన్ని ప్రజలే కాదు…సొంత పార్టీ వాళ్ళు సైతం వ్యతిరేకిస్తున్నరు.

మరోసారి కృష్ణుడుకు టికెట్ ఇస్తే..పార్టీ కోసం పనిచేయమని కూడా కార్యకర్తలు తేల్చి చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే యనమల…కొత్త రూట్ లోకి వచ్చారు. ఈ సారి తుని బరిలో తన కుమార్తె దివ్యని బరిలో దింపితే ఎలా ఉంటుందనే అంశంపై ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఆమెని బరిలో దింపడానికి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారని తెలిసింది. తుని నియోజకవర్గంలో దివ్య పోటీపై సర్వేలు కూడా చేయిస్తున్నారాట..అలాగే కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.

అటు యనమల అల్లుడు సైతం రంగంలోకి దిగారని తెలుస్తోంది. తునిలో దివ్యకు అన్నీ అంశాలు అనుకూలంగా మారేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక దివ్యకు సీటు ఇప్పించుకునే విషయంలో యనమల…ఇప్పటికే చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. బాబు సైతం..యనమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి యనమల…తన వారసురాలు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు.