సైమా అవార్డ్స్ 2021లో సత్తాచాటనున్న పుష్ప, అఖండ… నామినేషన్స్ ప్రకటన!

సౌత్ ఇండియాలోని 4 భాషలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ అంటే సైమా అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021 యేడాదిలో విడుదలైన దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్.. ‘పుష్ప’,తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. టాలివుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రిటీలతో త్వరలో ఘనంగా నిర్వహించనున్నారు.

సినిమా రంగంలోని 24 క్రాప్ట్స్ లోని టాలెంట్ కనబరిచిన నటులు, టెక్నీషియన్స్‌కు ఈ అవార్డులను ప్రకటించనున్నారు. అలాగే సినిమా రంగానికి సేవలు అందించిన ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరిస్తారు. అయితే ముందుగా టాలివుడ్ ఇండస్ట్రీకి సంబంధించి వివిధ కేటగిరీల్లోని ప్రధాన నామినేషన్లు చూసినట్లయితే 2021 యేడాదికి గాను సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఫుష్ప’ మూవీ ఏకంగా 12 నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. ఇందులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకత్వం సహా 12 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నట్టు సమాచారం.

అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ మూవీ ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఫైట్స్, ఫోటోగ్రఫీ సహా 10 విభాగాల్లో ఈ సినిమా నామినేషన్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ సినిమా ఉత్తమ నూతన నటీనటులుగా, ప్రతి నాయకుడిగా ఈ సినిమా 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక జాతి రత్నాలు సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు ఉత్తమ కమెడియన్‌తో పలు విభాగాల్లో 8 నామినేషన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.