ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్నమెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ కప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ పై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘనమైన విజయం సాధించింది.
ఇక మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది. మళ్లీ ఇందులో దాయాది దేశాలు తలపడనున్నాయి. ఆగస్టు 28న భారత్- పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్ గతేడాది ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా… లేదా పాకిస్తాన్ గెలుస్తుందా ? అన్న విశ్లేషణలు మొదలైపోయాయి.
ఇదే సందర్భంలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ పై పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఇటీవల ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఆసియా కప్‌లో భారత్- పాక్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లలో ఏ జట్టు బలంగా ఉంది? ఏ జట్టు గెలుస్తుంది? అని నెటిజెన్స్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అయితే ఆఫ్రిది పాక్ మాజీ ఆటగాడు కాబట్టి పాకిస్తాన్ గెలుస్తుందని అంటాడని అనుకున్నారు. కానీ అతను ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు. ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్ గెలుస్తారని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆసియా కప్ లో ఇరు జట్లు 14 సార్లు పోటీ పడగా… ఇందులో భారత్ 8 సార్లు విజయం సాధించింది.. పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.