ఎన్టీఆర్ గడ్డ ఈసారైనా దక్కుతుందా?

పామర్రు నియోజకవర్గం ఎన్టీఆర్ పుట్టిన గడ్డ…నిమ్మకూరు గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. అయితే ఇక్కడ టీడీపీ ఇంతవరకు గెలవలేదు. 2009 ముందు వరకు పామర్రు..గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. అప్పుడు గుడివాడలో టీడీపీ సత్తా చాటేది. ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్విభజన జరగడం, పామర్రు నియోజకవర్గం ఏర్పడటం, పైగా ఎస్సీ రిజర్వడ్ కావడంతో…ఇక్కడ టీడీపీ బలం తగ్గిపోయింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది.

2014లో వైసీపీ గెలిచింది..ఇక వైసీపీ తరుపున గెలిచిన ఉప్పులేటి కల్పన టీడీపీలోకి వచ్చారు. అయినా సరే ఇక్కడ టీడీపీ బలం పెరగలేదు…ఇంకా తగ్గుతూ వచ్చింది. 2014లో టీడీపీ వెయ్యి ఓట్ల మెజారిటీతో ఓడిపోతే, 2019 ఎన్నికల్లో దాదాపు 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో ఓడిపోయింది….అంటే టీడీపీ బలం చాలా వరకు తగ్గిపోయింది. అసలు కృష్ణా జిల్లాలో వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీ కూడా ఇదే. అంటే ఎన్టీఆర్ గడ్డపై టీడీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇటీవల కాలంలో అక్కడ పరిస్తితులు మారుతూ వస్తున్నాయి…వైసీపీ ఎమ్మెల్యేకు అంతగా అనుకూల పరిస్తితులు లేవు. ఎమ్మెల్యేపై కాస్త ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది…అదే సమయంలో యాక్టివ్ గా లేని ఉప్పులేటి కల్పనని పక్కన పెట్టి వర్ల రామయ్య తనయుడు కుమార్ రాజాకు టీడీపీ ఇంచార్జ్ పదవి ఇవ్వడం కలిసొచ్చే అంశం. ఇంచార్జ్ పదవి వచ్చిన దగ్గర నుంచి రాజా…నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు…ప్రతి గ్రామం పర్యటిస్తూ…కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

మొత్తానికైతే రాజా…నియోజకవర్గంలో టీడీపీకి కొత్త ఊపు వచ్చింది…అలాగే ఎమ్మెల్యేపై వ్యతిరేకత, గతంలో తక్కువ ఓట్లతో వర్ల రామయ్య ఓడిపోయిన సానుభూతి రాజాకు కలిసొచ్చేలా ఉన్నాయి. అయితే పామర్రులో గెలవాలంటే ఇంకా కష్టపడాల్సి ఉంది. ఎన్నికలనాటికి ఇంకా బలపడితే ఈ సారైనా ఎన్టీఆర్ గడ్డని టీడీపీ కైవసం చేసుకోగలదు..లేదంటే మళ్ళీ గెలుపుకు దూరమే.