డొక్కా ఎంట్రీ…శ్రీదేవి సీటుకు ఎసరు..?

మొత్తానికి తాడికొండ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఉండవల్లి శ్రీదేవికి సీటు కష్టమే అని తాజాగా…తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది…కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది..ఇక అమరావతిని రాజధానిగా చేయడంతో…తాడికొండలో టీడీపీకి తిరుగుండదనే పరిస్తితి కనిపించింది.

కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో ఊహించని విధంగా వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు…అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన శ్రీదేవి…పూర్తి స్థాయిలో మంచి పనితీరు కనబర్చడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది..పైగా ఆమెకు సొంత పార్టీలోనే పోరు ఎక్కువ ఉంది…బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వర్గంతో పడని పరిస్తితి ఉంది. అలాగే రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించడంలో శ్రీదేవి ఫెయిల్ అయ్యారు. అన్నిటికంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం శ్రీదేవికి బాగా నష్టం చేకూర్చింది అని చెప్పొచ్చు.

ఈ క్రమంలో నెక్స్ట్ తాడికొండ సీటు శ్రీదేవికి ఇస్తే…మళ్ళీ ఆమె గెలవడం కష్టమని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాడికొండ టికెట్ మళ్ళీ శ్రీదేవికి ఇవ్వరనే ప్రచారం జరుగుతుంది. ఇలా ప్రచారం జరుగుతున్న క్రమంలోనే  తాజాగా ఎమ్మెల్సీ డొక్కాని తాడికొండ అదనపు సమన్వయకర్తగా నియమించారు. ఇక డొక్కా నియమకానికి వ్యతిరేకంగా శ్రీదేవి..ఆమె అనుచరులు..గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి ముందు ఆందోళనకు చేశారు.

ఇక ఈ అంశాన్ని సుచరిత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా నెక్స్ట్ తాడికొండ సీటు శ్రీదేవికి దక్కేలా లేదు. అక్కడ డొక్కాకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి రెండుసార్లు తాడికొండలో గెలిచారు…నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కాబట్టి నెక్స్ట్ శ్రీదేవి సీటుకు డొక్కా ఎసరు పెట్టేలా ఉన్నారు.