వైసీపీలో మొక్కుబ‌డి మంత్రులు… ఫొటోల‌కు ఫోజులు మాత్ర‌మే..!

“అన్నా.. పార్టీ తిరిగి గెల‌వాలంటే.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండాలి. అంద‌రూ క‌లిసి.. ప్ర‌జ‌లకు మ‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు వివ‌రించండి!“ ఇదీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌. అయితే.. దీనిని ఎంత‌మంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంత‌మంది ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. పైగా.. మంత్రి నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం, బూడి ముత్యాల‌నాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వ‌ర‌కు మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు.

ఎక్క‌డిక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. ప్ర‌శ్నిస్తున్నార‌ని. తెలిసి.. కేవ‌లం స‌భ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. అంతేకాదు.. కొంద‌రు మంత్రులు.. వలంటీర్ల ద్వారా.. ముంద‌స్తు స‌ర్వేలు చేయించి.. తమ‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే `గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తన్నారు. దీంతో త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొందామ‌ని అనుకున్న ప్ర‌జ‌ల‌కు నిరాశే ఎదుర‌వుతోంది. పైగా.. ప్ర‌శ్నిస్తార‌ని అనుమానం వ‌చ్చిన ప్ర‌జ‌ల‌ను మంత్రులు త‌ప్పించుకుని వెళ్లిపోతున్నారు.

దీంతో.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం మంత్రుల విష‌యంలో మొక్కుబ‌డి వ్య‌వ‌హారంగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. మొన్నీమ‌ధ్య సీమ‌కు చెందిన ఒక మంత్రి.. ఆస‌క్తిగా స్పందించారు. “ఎక్క‌డికి వెళ్లినా.. స‌మ‌స్య‌లు చెబుతున్నారు. మాకు కూడా స‌మ‌స్య‌లు ఉన్నాయి.. ఎవ‌రికి చెప్పు కోవాలి?“ అని ఆయ‌న నిల‌దీశారు. దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌లు మౌనంగా ఎవ‌రి గ‌డ‌ప‌లోకి వారు వెళ్లిపో యారు. ఇదిలావుంటే.. మ‌రికొంద‌రు ఫొటోల‌కు ఫోజులు ఇచ్చి.. సైలెంట్ అవుతున్నారు. మ‌రి మంత్రులు ఇప్ప‌టికైనా..తమ ప‌ద్ధ‌తి మార్చుకుంటారో లేదో .. చూడాలి.

Share post:

Latest