బాలీవుడ్ తో ఓ ఆట ఆడుకుంటున్న టాలీవుడ్?

అవును, గత కొన్ని సంవత్సరాలనుండి బాలీవుడ్, సినిమాల విషయంలో కాస్త వెనుకబడిపోయింది. అప్పటివరకు ఓ తెలుగు సినిమాని ఓ సినిమాలాగ కూడా బాలీవుడ్ పరిగణించేది కాదు. కానీ ప్రస్తుతం లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా ఏకంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తోంది. పాన్ ఇండియా రేస్ లో వెనకబడ్డ బాలీవుడ్ ఇరుగు పొరుగు ఇండస్ట్రీల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతీయ సినిమాకి వెన్నెముక అని చెప్పుకునే ముంబై పరిశ్రమపై ఇపుడు టాలీవుడ్ విరుచుకుపడింది.


తాజాగా IMDB వెల్లడించిన గణాంకాలు దానికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. మునుపెన్నడూ లేని తీవ్రమైన సంక్షోభాన్ని హిందీ చిత్రసీమ ఇపుడు ఎదుర్కొంటోంది. హిందీ చిత్రపరిశ్రమ దిగ్గజాలుగా చెప్పుకునే ఖాన్ ల త్రయంతో పాటు కపూర్ లు బచ్చన్ లు రోషన్ లు తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్.ఆర్.ఆర్ – కేజీఎఫ్ 2 సంచలన విజయాలు నమోదు చేసి 1000 కోట్ల క్లబ్ లో నిలవడం కూడా బాలీవుడ్ కి సవాల్ గా మారింది. సౌత్ నుంచి వచ్చే రా యాక్షన్ కంటెంట్ సినిమాలకు పట్టంగట్టేందుకు లేదా వైవిధ్యం ఉన్న సౌత్ సినిమాల్ని వీక్షించేందుకు ఉత్తరాది ప్రజలు ఆసక్తిని కనబరచడం బిటౌన్లో ఇపుడు గుబులు రేపుతోంది.

అవును… ఈ మార్పు బాహుబలి తరువాతే మొదలయ్యింది. తాజాగా ప్రఖ్యాత ఐఎండిబి వెల్లడించిన బాక్సాఫీస్ గణాంకాలను పరిశీలిస్తే బాలీవుడ్ పై సౌత్ హవా.. ఎలా సాగిందో అర్థం అవుతోంది. ఈ దండయాత్ర అనేది జక్కన్న బాహుబలి తరువాత షురూ అయ్యింది. తరణ్ ఆదర్శ్.. కరణ్ జోహార్ లాంటి ట్రేడ్ నిపుణులు సైతం బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు చేస్తున్నారు. అనుపమ్ ఖేర్ లాంటి నటుడు ఇప్పటికే తెలుగు – కన్నడం సహా ఇతర భాషల సినిమాలను పొగిడేస్తున్న తీరు బాలీవుడ్ వెనకబాటుకు సూచికగా కనిపిస్తోంది.