‘సైకిల్’ రివర్స్..’సభ్యత్వం’లోనే షాక్?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా అనుకూల పరిస్తితులు రావడం లేదు..పూర్తిగా వైసీపీని డామినేట్ చేసే బలం టీడీపీకి వచ్చినట్లు కనిపించడం లేదు..పైకి ఏదో వైసీపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా తమదే అధికారమని టీడీపీ నేతలు డప్పుకుంటున్నారు…కానీ వాస్తవ పరిస్తితులని చూస్తుంటే అలా లేవు…ఇంకా వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

అదే సమయంలో టీడీపీకి ఇంకా పెద్ద స్థాయిలో ఆదరణ రాలేదు. దానికి ఉదాహరణగా టీడీపీ సభ్యత్వ కార్యక్రమం నిలుస్తుందని చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు ఉన్నా సరే…టీడీపీ ఆదరణ కోల్పోకుండా ఉందంటే…దానికి కారణం కార్యకర్తలు మాత్రమే. కార్యకర్తలే పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యకర్తలే పార్టీని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేతలు..కార్యకర్తలకు అండగా నిలబడలేదు.

దీంతో కార్యకర్తలు సైలెంట్ అయ్యారు..అందుకే టీడీపీ సభ్యత్వ కార్యక్రమం కూడా విజయవంతం కావడం లేదు. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉండగా…రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి…మొత్తం 60 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. ఎలాగో తెలంగాణలో టీడీపీ పని అయిపోయింది..అక్కడ పట్టుమని లక్ష మంది సభ్యత్వాలు చేసుకున్నా గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది.

ఇక ఏపీలో ప్రతిపక్షంలో ఉంది…అయితే ఇక్కడ పార్టీ బలంగానే ఉంది…అయినా సరే మెరుగైన స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం లేదు. యాప్‌ ద్వారా సభ్యత్వాలు చేస్తున్నారు. అయితే సభ్యత్వ నమోదు మొదలుపెట్టి మూడు నెలలైనా ఇప్పటికి 10 లక్షల మంది సభ్యత్వ నమోదు కూడా పూర్తి కాలేదు. అంటే 60 లక్షల సభ్యత్వాలు ఎక్కడ? 10 లక్షల ఎక్కడ? అంటే టీడీపీ పరిస్తితి పూర్తిగా రివర్స్ అయిపోయింది.

అయితే యాప్ లో ఉండే సాంకేతిక సమస్యల వల్ల సభ్యత్వ నమోదు సరిగ్గా జరగలేదని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కానీ ఏది ఉన్నా సరే…ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వాల నమోదు చూస్తుంటే…టీడీపీకి ఆదరణ తగ్గుతున్నట్లే కనిపిస్తోంది.