అచ్చెన్నకు అందుకే ఈ అరుదైన గౌరవం …!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడితో కలిసి వేదికను పంచుకునే అదృష్టం అచ్చెన్నకు దక్కింది. ఇంతటి అరుదైన గౌరవం అచ్చెన్నకు ఎలా దక్కింది ? ఎలాగంటే 4వ తేదీన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోడి ఆవిష్కరించబోతున్నారు.

భీమవరంలో జరగబోయే కార్యక్రమంలో హాజరవ్వాలంటు ప్రతిపక్షాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీకి కూడా ఆహ్వానం అందింది. ఈ నేపధ్యంలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నను భీమవరంకు పంపుతున్నారు. అచ్చెన్న పార్టీ అధ్యక్ష పదవి అందుకున్న తర్వాతనే పార్టీకి ఒక ఊపొచ్చిందని చెప్పచ్చు. అంతకుముందు ఒక సీనియర్ నేత అధ్యక్షుడిగా ఉన్నపుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుండేది కాదు.

అలాంటిది అచ్చెన్న పగ్గాలు అందుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుపుట్టడమే కాకుండా బీసీ వర్గాల్లో కూడా పార్టీ వైపు మొగ్గు మొదలైందనే చెప్పాలి. స్వతహాగానే దూడుకు మనస్తత్వం ఉన్న నేత కావటంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తనదైన పద్దతిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రెగ్యులర్ గా మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు.

పార్టీ కార్యాలయంలో నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. అందుబాటులో ఉండటమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేట్లుగా దిశానిర్దేశం చేస్తున్నారు. తనపైన కేసులు పెట్టినా భయపడకుండా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చాలెంజులు విసురుతు మిగిలిన నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వివిధ అంశాలపై స్పష్టమైన పరిజ్ఞానం ఉండటంతో సభల్లో కానీ మీడియా సమావేశాల్లో కానీ సుత్తిలేకుండా చెప్పదలచుకున్నది సూటిగా చెబుతున్నారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తాను చెప్పదలచుకున్న విషయం నేతలకు, మీడియా వాళ్ళకే కాకుండా మామూలు జనాలకు కూడా అర్ధమైపోతోంది. సీనియారిటి, సబ్జెక్టుల్లో పరిజ్ఞానం, బీసీల్లో పట్టున్న నేత కాబట్టే మోడితో వేదికను పంచుకునేందుకు తగిన నేతనిపించుకున్నారు.

Share post:

Latest