త‌ప్పొక‌రిది.. శిక్ష మ‌రొక‌రికి… వైసీపీలో ర‌గులుతోందిగా…!

వైసీపీ నాయ‌కులు.. ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్ర‌హంతో ర‌గ‌లిపోతున్నారు. త‌ప్పొక‌రిది అయితే.. శిక్ష మాకు ప‌డుతోంది! అని వారు తీవ్ర‌స్తాయిలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్లు ఇస్తారు? ఎవ‌రికి ఇవ్వ‌రు అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ప్ర‌జల్లో ఉండేవారికిమాత్ర‌మే టికెట్లు ఇస్తామ‌ని.. సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉన్న‌వారికే ఇస్తామ‌న్నారు.

అయితే.. ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీ నేత‌ల మ‌ధ్య ఇబ్బందిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ ఎమ్మె ల్యేలు.. ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ 130 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు దారుణంగానే ఉన్నాయి. ఎవ‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్నారు? ఎవ‌రు తిర‌గ‌డం లేదు..? అనే విష‌యాలు ప‌క్కన పెడితే.. ఎవ‌రు తిరిగినా.. తిర‌గ కున్నా.. ప్ర‌జ‌ల మ‌ధ్య మాత్రం వారికి అనుకున్న విధంగా ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. అయినా.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి.. గుర‌వుతుండడం.. వారితో మాట‌లు ప‌డుతుండ‌డం వంటివి.. నాయ‌కుల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఈ నేప‌థ్యంలోనే నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు.“నియోజ‌క‌వ‌ర్గంలోఅభివృద్ది లేదు. మాట‌కు విలువ అంత‌క‌న్నా లేదు. త‌ప్పు మాది కాదు. మాకు నిధులు ఇవ్వ‌డం లేదు. అభివృద్ధి ఎలా చేస్తాం. పోనీ.. సామాజిక పింఛ‌న్లు ఇవ్వాల‌ని చాలా మంది కోరుతున్నారు. వీటిని ఇద్దామ‌న్నా..మాకు ప‌వ‌ర్ లేదు. అంతా వ‌లంటీర్లే చూసుకుంటున్నారు. కానీ, ప్ర‌జ‌లు మాత్రం మ‌మ్మ‌ల్ని తిడుతున్నారు., ఇదేం ప‌రిస్థితి“ అని తూర్పుకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇటీవ‌ల వాపోయారు.

ఇదే ప‌రిస్థితి సీమ‌లోనూ క‌నిపిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. వాపోతున్నారు. ఇవ‌న్నీ తాము చేసిన త‌ప్పులు కాద‌ని..వారు చెబుతున్నారు. అయినా.. ప్ర‌జ‌ల‌తో తాము తిట్లు ప‌డుతున్నామ‌ని.. వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామాల‌తోవారు క‌ల‌త చెందుతున్నారు. దీంతోచాలా మంది నాయ‌కులు.. అస‌లు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డం కూడా మానుకున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితిని జ‌గ‌న్ ఎలా స‌రిదిద్దుతారో చూడాలి.