తెలంగాణ రాజ‌కీయాల్లో చిరంజీవి, మోహ‌న్ బాబు…!

కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి స‌రికొత్త వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా పాత ప్ర‌త్య‌ర్థుల‌ను క‌లిసేలా చేస్తున్నారు. చిరంజీవి-మోహ‌న్ బాబు బంధాన్ని గుర్తు చేసి పాత జ్ఞాప‌కాల్లోకి తీసుకెళ్లిపోయారు. ప్ర‌ధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మ‌ధ్య వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డానికి సినిమాటిక్ గా తీసుకెళ్ల‌డం జ‌గ్గారెడ్డికే చెల్లింది. ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

రెండు రోజుల క్రితం జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ బంధాన్ని త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ నిజంగానే బీజేపీని వ్య‌తిరేకించిన‌ట్ల‌యితే.. ఆయ‌న‌కు చిత్త‌శుద్ది ఉంటే మోదీ బ‌స చేస్తున్న నోవాటెల్ హోట‌ల్ ముందు ధ‌ర్నా చేయాల‌ని సూచించారు. ప‌నిలో ప‌నిగా బీజేపీలో చేరుతున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని విమ‌ర్శించారు. ఆయ‌న‌కు రాజ‌కీయ ఓన‌మాలు తెలియ‌వ‌ని.. ఆయ‌నో మెడికిల్ మాఫియా అని విమ‌ర్శించారు. విశ్వేశ్వ‌ర్ రెడ్డి, పార్థ‌సార‌థి రెడ్డి మెడిక‌ల్ మాఫియా కోసం అధికారంలో ఉన్న వారి పంచ‌న చేర‌తార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా.. జ‌గ్గారెడ్డి హ‌ఠాత్తుగా చిరంజీవి-మోహ‌న్ బాబు ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి క‌ల‌క‌లం సృష్టించారు. కేసీఆర్‌-మోదీల స్టంట్‌.. బిల్లా-రంగా సినిమాలో చిరంజీవి, మోహ‌న్‌బాబు మాదిరిగా ఉంద‌ని దెప్పిపొడిచారు. ఆ సినిమాలో వారిద్ద‌రూ ప్ర‌జ‌ల ముందు త‌న్నుకుంటూ ఉంటార‌ని.. అంద‌రూ వెళ్లిపోయాక కౌగిలించుకుంటార‌ని అన్నారు. వీరిద్ద‌రిలా మోదీ, కేసీఆర్ వ్య‌వ‌హారశైలి ఉంద‌ని విమ‌ర్శించారు.

అయితే.. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌ల్ని సినీ ప‌రిశ్ర‌మ కూడా స్వాగ‌తిస్తోంది. చిరంజీవి, మోహ‌న్ బాబు ఇప్ప‌టికీ అలాగే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గుర్తు చేస్తున్నారు. ఆ సినిమా మాదిరిగానే వారి నిజ‌జీవితాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో ఒక‌రినొక‌రు విమ‌ర్శించుకుంటార‌ని.. కానీ తెర‌వెనుక మాత్రం ఇప్ప‌టికీ అల్లుకుపోతార‌ని అంటున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అవార్డుల‌ స‌భ‌లో.., మా సినిమా ఎన్నిక‌ల్లో.., చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలో ఇలా.. అనేక‌సార్లు వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థులుగా ప‌ని చేశార‌ని.. కానీ బ‌య‌ట మాత్రం స్నేహితులుగా చెప్పుకుంటార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇదిలా ఉంచితే.. వీరిద్ద‌రి విష‌యంలో యాదృచ్ఛికంగా ఒక సంఘ‌ట‌న జ‌ర‌గ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల మోహ‌న్ బాబు వైసీపీకి దూరంగా బీజేపీకి ద‌గ్గ‌ర‌గా జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ద్వారా బ‌య‌ట‌ప‌డుతోంది. ఆయ‌న త్వ‌ర‌లోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్లు స‌మాచారం. అలాగే.. చిరంజీవికి కూడా బీజేపీ గాలం వేస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి చిరంజీవిని ఆహ్వానించారు.

దీనికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ వ‌స్తుండ‌డం విశేషం. మోహ‌న్ బాబుకు కూడా ఆహ్వానం అందిన‌ట్లు స‌మాచారం. ఈ స‌భ ద్వారా పాత ప్ర‌త్య‌ర్థుల‌ను మిత్రులుగా మార్చి.. త‌మ పార్టీలో చేర్పించాల‌నేది బీజేపీ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదే జ‌రిగితే ఒక ర‌కంగా జ‌గ్గారెడ్డి త‌న వ్యాఖ్య‌ల ద్వారా వీరిద్ద‌రికీ మేలు చేసిన‌ట్లే. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!