చింత‌ల‌పూడి వైసీపీ టిక్కెట్ రేసులో విజ‌య‌రాజు…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు గ‌ట్టిగా యేడాది మాత్ర‌మే టైం ఉన్న‌ట్టు లెక్క‌. ఎన్నిక‌ల చివ‌రి యేడాది అంతా రాజ‌కీయ యుద్ధ‌మే న‌డుస్తుంది. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ అన్ని పార్టీల్లో ఆశావాహుల హ‌డావిడి మామూలుగా లేదు. అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా… దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా చేయించిన స‌ర్వేలో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. వీరిలో చాలా మందిని ప‌క్క‌న పెట్టేసి కొత్త‌వాళ్ల‌తోనే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ కొత్త ముఖాల‌తోనే తిరుగులేని విజ‌యం సాధించిన జ‌గ‌న్ ఇప్పుడు 2024లోనూ అదే అస్త్రం వాడుతున్నాడు.

ఈ క్ర‌మంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడిలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను మారుస్తార‌న్న ప్ర‌చారం అయితే ముమ్మ‌రంగా సొంత పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది. చింత‌ల‌పూడి వైసీపీ క్యాండెట్ విష‌యంలో పార్టీ అధిష్టానానికి ఎప్పుడూ ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ముగ్గురు, న‌లుగురు ఇన్‌చార్జ్‌ల‌ను మార్చి ఎట్ట‌కేల‌కు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఎలీజాను రంగంలోకి దించారు. ఎలీజా ఎమ్మెల్యేగా గెలిచిన యేడాది నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాలు తీవ్ర‌మ‌య్యాయి.

ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం చింత‌ల‌పూడే. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది. చివ‌ర‌కు ఎంపీ శ్రీథ‌ర్ సొంత మండ‌లం కామ‌వ‌ర‌పుకోట‌ల‌నూ ఎమ్మెల్యే ఎలీజా త‌న వ‌ర్గాన్ని ప్రోత్స‌హించ‌డంతో వైసీపీ గ్రూపులు గ్రూపులుగా చీలిపోయి స‌ర్వ‌నాశ‌నం అయిపోతోంద‌ని కేడ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. చివ‌ర‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చాలా చోట్ల పార్టీ నుంచే రెండు వ‌ర్గాలు పోటీ పెట్టాయి.

ఎవ‌రెన్ని చెప్పినా… తాత్కాలికంగా చేతులు క‌లిపినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరు క‌లిసి ప‌నిచేసే అవ‌కాశాలే లేవు. ఎంపీ శ్రీథ‌ర్‌కు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన వ‌ర్గం ఉంది. ఎమ్మెల్యే ఎలీజా బ‌లంగా ఉన్న‌ ఎంపీ వ‌ర్గంతో క‌లిసి ప‌నిచేయ‌డం లేదు. ఇటు ఎంపీ వ‌ర్గం కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి న్యాయం జ‌ర‌గాల‌ని పోరాడుతోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఎంపీ వ‌ర్గం వ‌చ్చే ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి వైసీపీ అభ్య‌ర్థిగా ప్ర‌భుత్వ అధికారి కంభ‌పు విజ‌య‌రాజు పేరును ప్ర‌తిపాదిస్తోంది.

కామ‌వ‌ర‌పుకోట మండ‌లం.. కామ‌వ‌ర‌పుకోట‌కు చెందిన విజ‌య‌రాజుకు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో గ‌త రెండు ద‌శాబ్దాలుగా విస్తృతంగా ప‌రిచ‌యాలు ఉన్నాయి. 2009లో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ అయిన‌ప్పుడే ఆయ‌న దివంగ‌త వైఎస్సార్ తో యాక్స‌స్ ఉన్న టీం ద్వారా కాంగ్రెస్ టిక్కెట్ కోసం ట్రై చేశారు. త‌ర్వాత 2014లో వైసీపీ టిక్కెట్ కోసం ప్ర‌య‌త్నించిన ఆయ‌న‌… గ‌త ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్ వ‌స్తుంద‌ని ఆశించారు.

అయితే కొన్ని ఈక్వేష‌న్ల‌తో పాటు అధిష్టానం ఆలోచ‌న‌ల నేప‌థ్యంలో విజ‌య‌రాజు ఆశ‌లు నెర‌వేర‌లేదు. అయితే ఈ సారి ఎంపీ వ‌ర్గం అంతా విజ‌య‌రాజుకు మాత్ర‌మే టిక్కెట్ వ‌స్తేనే పార్టీ గెలుస్తుంద‌ని చ‌ర్చించుకుంటోంది. పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న వాళ్లు… గ‌త ఎన్నిక‌ల‌కు ముందు క‌ష్ట‌ప‌డ‌ని వారిని కాద‌ని.. ఎలీజా త‌న వ‌ర్గం వాళ్ల‌ను మాత్ర‌మే ప్రోత్స‌హించ‌డం… వాళ్లంద‌రూ ప్ర‌జాక్షేత్రంలో కేడ‌ర్ బ‌లం లేని వాళ్లే ఉండ‌డం… అందులోనూ ఓ వ‌ర్గాన్నే ఎక్కువుగా స‌పోర్ట్ చేయ‌డం లాంటి కార‌ణాల‌ను ఆయ‌న మైన‌స్‌లుగా పార్టీ వాళ్లే చూపిస్తున్నారు.

ఇక విజ‌య‌రాజు వియ్యంకుడు శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ కొయ్యే మోషేన్ రాజు కావ‌డం… ఇటు ఆయ‌న కుమారుడు ఐపీఎస్‌కు ఎంపిక కావ‌డంతో ప్ర‌భుత్వంతో అన్ని విధాలా మాంచి యాక్సెస్ ఉంది. ఇటు ఎంపీ శ్రీథ‌ర్‌తో పాటు ఆయ‌న వ‌ర్గం వాళ్లంద‌రూ విజ‌య‌రాజుకే స‌పోర్ట్ చేస్తున్నారు. ఇటు ఆర్థిక, అంగ‌బ‌లాల‌తో పాటు అన్ని ఈక్వేష‌న్లు క‌లిసి వ‌స్తున్నాయి. ఇటు జ‌గ‌న్ రిపోర్టుల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాపై వ్య‌తిరేక‌త ఉండ‌డం.. ఇక్క‌డ సీటు మారుస్తార‌న్న ప్ర‌చారం కూడా విజ‌య‌రాజు వైపు అంద‌రూ మొగ్గు చూప‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌రి వ‌చ్చే ఐదారు నెల‌ల్లో చింత‌ల‌పూడి వైసీపీ రాజ‌కీయంలో పెనుమార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.